Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:55 PM

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గంజాయిపై ఉక్కుపాదం
ఎస్పీ వకుల్‌ జిందాల్‌

- ఎస్పీ వకుల్‌ జిందాల్‌

విజయనగరం క్రైం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని నియంత్రించేందుకు బహుముఖ వ్యూహాలు అమలుతో పాటు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చెక్‌పోస్టుల ఏర్పాటు, వాహన తనిఖీలు చేపట్టడం, ప్రధాన నిందితులను గుర్తించడం, గంజాయి వ్యాపారాలతో కూడబెట్టిన అక్రమ ఆస్తులను సీజ్‌ చేయడం వంటివి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సంకల్పం కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, యువత, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ‘గత ఏడాది గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 88 కేసులు నమోదు చేశాం. 2,157 కిలోల గంజాయి, 78 గ్రాముల నల్లమందు, రవాణాకు వినియోగించిన 30 వాహనాలు సీజ్‌ చేశాం. 288 మందిని అరెస్టు చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకూ 52 కేసులు నమోదు చేసి 346 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. రవాణాకి వినియోగించిన 21 వాహనాలు సీజ్‌ చేశాం. 155 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం.’ అని ఎస్పీ వివరించారు.

Updated Date - Jun 22 , 2025 | 11:55 PM