టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:52 PM
ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
విజయనగరం, కలెక్టరేట్, డిసెంబరు 18(ఆంధ్ర జ్యోతి): ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు. ఈసందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 2010 ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు అంతా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అందరినీ ఆందోళన కలిగిస్తుందన్నా రు. ప్రతి ఉపాధ్యాయుడు డీఎస్సీ పరీక్ష ద్వారా నియామకమైనవారని, విద్యా శాఖ నిర్వహించిన ప్రతి శిక్షణా తరగతిలో పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. 2025 జూన్‌లో బదిలీ కోరుకున్న ఉపాధ్యాయు లు ఇప్పటికీ రిలీవ్ కాలేదన్నారు. సింగిల్ టీచర్ స్కూల్స్‌లో పని చేసే ఉపాధ్యాయు లకు సెలవులు మంజూరులో కలుగుతున్న ఇబ్బందుల ను తొలగించాలన్నారు. 100 రోజుల ప్రణాళిక నుంచి ఆదివారం, రెండవ శనివారం, పండుగ దినాలను మినహాయించాలని కోరారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించే నిబంధనను తొలిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకురాలు విజయగౌరి తదితరులు ఉన్నారు.