Share News

An End to the Chaos! గందరగోళానికి తెర!

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:00 AM

An End to the Chaos! ‘పీ4’లో భాగంగా పేద కుటుంబాల బాగోగుల బాధ్యతను తీసుకునే ‘మార్గదర్శు’ల విషయంలో ఏర్పడిన గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని స్పష్టం చేసింది. అయితే అంతకముందు కొందరు అధికారులు అవగాహన లేక తప్పనిసరిగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ప్రధానంగా విద్యా శాఖలో ఈ పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

An End to the Chaos! గందరగోళానికి తెర!

  • పీ4 ‘మార్గదర్శు’ల విషయంలో స్పష్టమైన ఆదేశాల్చిన సర్కారు

  • కానీ అంతకముందు జిల్లాలో భిన్న పరిస్థితి

  • తప్పనిసరి అంటూ టీచర్లపై అంతర్గతంగా కొంతమంది విద్యాశాఖ అధికారుల ఒత్తిడి

  • కలెక్టర్‌ ఉత్తర్వులతో మారిన సీన్‌.. మౌఖిక ఆదేశాలు రద్దు

  • ఇప్పటివరకు 12,705 కుటుంబాలను దత్తత తీసుకున్న 2,730 మార్గదర్శులు

  • మరికొంతమంది ముందుకొస్తున్న వైనం

పార్వతీపురం, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘పీ4’లో భాగంగా పేద కుటుంబాల బాగోగుల బాధ్యతను తీసుకునే ‘మార్గదర్శు’ల విషయంలో ఏర్పడిన గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని స్పష్టం చేసింది. అయితే అంతకముందు కొందరు అధికారులు అవగాహన లేక తప్పనిసరిగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ప్రధానంగా విద్యా శాఖలో ఈ పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. తప్పనిసరి అంటూ టీచర్లకు అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం , కలెక్టర్‌ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో టీచర్లపై జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేశారు. వాస్తవంగా పీ4 కార్యక్రమంలో ఒక కుటుంబాన్ని ఎవరైనా దత్తత తీసుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఎవరికైనా ఆసక్తి ఉంటే పేదలను పైకి తీసుకొచ్చే సదుద్దేశంతో మార్గదర్శిగా నమోదు చేసుకోవచ్చు. మొత్తంగా నమోదు, సాయం అనేది స్వచ్ఛందమేనని సర్కారు తెలియజేసింది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 350 గ్రామ, వార్డు సచివాయాలు ఉన్నాయి. అయితే 333 సచివాలయాల పరిధిలో గతంలో అధికారుల బృందం సర్వే నిర్వహించింది. ఈ మేరకు 42,815 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1,36,408 మంది కుటుంబ సభ్యులకు ఆర్థిక, ఆర్థికేతర సహకారం అందించాలని భావించారు. మొత్తంగా నిర్ణీత గడువులోగా కనీసం 33 వేల కుటుంబాలను దత్తత తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. కాగా ఈ నెల 28 వరకు 12,705 కుటుంబాలను 2,730 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు.

మార్గదర్శులుగా ఉద్యోగులు

బంగారు కుటుంబాల దత్తత విషయంలో 24 శాఖలు తమ సహకారం అందించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతోజిల్లాలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు. గ్రామ, సచివాలయ కార్యదర్శులు ,ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల అధికారులు మార్గదర్శులుగా తమ పేర్లును నమోదు చేసుకుంటున్నారు. కాగా సరైన అవగాహన లేక కొన్ని మండలాల్లో ఎంఈవోలు తప్పనిసరిగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని టీచర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి ’ ప్రధాన సంచికలో కథనం ప్రచురించడంతో ప్రభుత్వం స్పందించింది. బంగారు కుటుంబాల దత్తత అంశం స్వచ్ఛందమేనని ప్రకటించింది. దీంతో విద్యాశాఖలో కొంతమంది అధికారులు తమ మౌఖిక ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఒత్తిడి లేకుండానే ఉపాధ్యాయులు పీ4లో భాగంగా మార్గదర్శులుగా నమోదు చేసుకుని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు.

వారి అభివృద్ధికి కృషి

పార్వతీపురం మండలం పెద్దబొండపల్లిలో రెండు కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఆ కుటుంబాలను నాన్‌ ఫైనాన్స్‌ రంగంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ఈ విషయంలో నాపై ఎవరి ఒత్తిడి లేదు. స్వచ్ఛందంగా ఆ రెండు కుటుంబాలను దత్తత తీసుకున్నా. నాకు అవకాశం ఉన్నంత వరకు వారికి సహాయాన్ని అందిస్తా.

- రవికుమార్‌, ఉపాధ్యాయుడు, పెద్దబొండపల్లి, పార్వతీపురం మండలం

==============================================

ఒత్తిడి చేశారు..

కొన్ని మండలాల విద్యాశాఖాధికారులు బంగారు కుటుంబాల దత్తత విషయంలో మార్గ దర్శులుగా ఉండాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. టీచర్లపై ఎటువంటి ఒత్తిడి చేయకూడదని పీఆర్‌టీయూ తరఫున ప్రభుత్వాన్ని కోరాం.

- అమరాపు సూర్యనారాయణ, రాష్ట్ర పీఆర్‌టీయూ అసోసియేట్‌ అధ్యక్షుడు

==========================================

ఆదేశాలు ఇవ్వలేదు

ఉపాధ్యాయులు తప్పనిసరిగా మార్గదర్శులుగా ఉండాలని ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి ఇష్ట ప్రకారమే బంగారు కుటుంబాలను దత్తత తీసు కోవచ్చు. ఈ విషయంలో విద్యాశాఖ ద్వారా ఎవరిపైనా ఎటు వంటి ఒత్తిడి లేదు.

- బి.రాజ్‌కుమార్‌, డీఈవో, పార్వతీపురం మన్యం

=====================================

మానవతా దృక్పథంతో...

స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారిని బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శులుగా ఎంపిక చేయాలని అధికారులకు స్పష్టంచేశాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శుల ఎంపిక ప్రక్రియలో ఎవరిపై ఒత్తిడి ఉండబోదు. మానవతా దృక్పథంతో ఎవరైనా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని సాయం అందిందొచ్చు.

- శ్యామ్‌ప్రసాద్‌, కలెక్టర్‌

======================================

Updated Date - Jul 31 , 2025 | 12:00 AM