ఏఎంసీలు గాడిన..!
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:12 AM
జిల్లాలో మార్కెట్ కమిటీలు గాడిన పడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మార్కెట్ కమిటీలపై దృష్టిపెట్టింది.

- మెరుగుపడుతున్న ఆదాయం
- ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.12.89 కోట్లు
- సమకూరింది రూ.10.47 కోట్లు
- గత ఏడాది కంటే రూ 1.30 కోట్లు పెరుగుదల
విజయనగరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మార్కెట్ కమిటీలు గాడిన పడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మార్కెట్ కమిటీలపై దృష్టిపెట్టింది. పన్నుల వసూలతో పాటు గోదాంల అద్దెలు, బకాయిలపై ఫోకస్ పెట్టడంతో లాభాల బాటలోకి వచ్చాయి మార్కెట్ కమిటీలు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన నాటికి ప్రగతిపథంలో కనిపించాయి. జిల్లాలోని ఎనిమిది మార్కెట్ కమిటీలకుగాను 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వ్యవసాయ ఉత్పత్తులపై రూ.12.89 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించగా..రూ.10.47 కోట్లు సమకూరాయి. గత ఏడాది కంటే ఇది రూ.1.30 కోట్లు అధికం.
లక్ష్యానికి చేరువగా..
జిల్లాలో రాజాం, బొబ్బిలి, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, పూసపాటిరేగ, చీపురుపల్లి, మెరకముడిదాంలో మార్కెట్ కమిటీ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో కొత్తవలస, మెరకముడిదాం, పూసపాటిరేగ కమిటీలు శతశాతం వసూలు లక్ష్యాన్ని చేరుకున్నాయి. గజపతినగరం, విజయనగరం, రాజాం ఏఎంసీలు కాస్తా వెనుకబడ్డాయి. కానీ, గతం కంటే పుంజుకున్నాయి. ఈ ఏడాది ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఒక్కో ఏఎంసీకి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఏఎంసీలకు రూ.2.50 కోట్ల ఆదాయ రానుంది. ఇది గత ఏడాది కంటే రూ.1.30కోట్లు ఆదాయం మెరుగుపరచుకున్నట్టే. కొత్తవలసలో రూ.1.02 కోట్లు లక్ష్యం కాగా రూ.1.03 కోట్లు వసూలైంది. పూసపాటిరేగలో రూ.1.67 కోట్లకుగాను రూ.1.68 కోట్లు, మెరకముడిదాంలో రూ.60 లక్షలకు గాను రూ.60.65 లక్షల ఆదాయం పన్నుల రూపంలో సమకూరింది. విజయనగరంలో రూ.1.43 కోట్లగాను రూ.98 లక్షలు వసూలైంది. బొబ్బిలిలో రూ.2.91 కోట్లగాను రూ.2.38 కోట్లు, గజపతినగరంలో రూ.2.09 కోట్లకుగాను రూ.1.42 కోట్లు, చీపురుపల్లిలో రూ.1.60 కోట్లకుగాను రూ.1.18 కోట్లు, రాజాంలో రూ.1.57 కోట్లకుగాను రూ.1.18 కోట్లు వసూలయ్యాయి.
వైసీపీ హయాంలో తప్పిన లెక్క..
సాధారణంగా నియోజకవర్గానికి ఒకటి, రెండు వరకూ మార్కెట్ కమిటీ కార్యాలయాలు ఉంటాయి. వీటికి చెక్‌పోస్టులు, గోదాముల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమయంలో సెస్ వసూల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఆయా ఏఎంసీల పరిధిలో ఉండే మండలాలకు కేటాయించాలి. వెనుకబడిన గ్రామాలు, పూర్తి వ్యవసాయ ఆధారిత పంచాయతీలకు ఏఎంసీ వాటా నిధులు కేటాయించాలి. గతంలో గ్రామాల్లో సీసీ రహదారులు, కాలువలు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం ఈ నిధులు కేటాయించేవారు. స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం ఎంతగానో ఆశగా ఎదురుచూసేవారు. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం ఏఎంసీల ఆదాయం మొత్తం సర్కారు ఖజానాలోకి వెళ్లిపోయింది. అక్కడ నుంచి సిబ్బంది జీతాలే వచ్చాయే తప్ప.. స్థానిక అవసరాలు, రైతు సేవలకు వినియోగించిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలతో జిల్లా మార్కె టింగ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపింతే రూపాయి కూడా విదల్చలేదు. 8 ఏఎంసీల్లో రూ.2 కోట్లతో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా అతీగతీ లేకుండా పోయింది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాల సేవల గురించి ప్రస్తావిస్తే మాత్రం మౌనమే సమాధానమవుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు ఏఎంసీ నిధులు కేటాయించేది. పశు వైద్యశిబిరాలు నిర్వహించేది. ఏడాదికి నాలుగు పశు వైద్య శిబిరాలు నిర్వహించడం తప్పనిసరి. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ పనిచేయలేదు. మళ్లీ అటువంటి ఆనవాయితీ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
శుభ పరిణామం
మార్కెటింగ్ శాఖ ఆదాయం పెంచుకోవడం శుభ పరిణామం. గత ఏడాది కంటే పన్నుల రూపంలో ఆదాయం వచ్చింది. సివిల్ సప్లై నుంచి బకాయిలు రానున్నాయి. అదనపు ఆదాయాన్ని వ్యవసాయ అనుబంధరంగాలకు ఖర్చుచేస్తాం. అందుకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఏఎంసీల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
- రవికిరఃణ్, ఏడీ, మార్కెటింగ్ శాఖ, విజయనగరం