Share News

కొలువుదీరనున్న ఏఎంసీ పాలకవర్గాలు

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:01 AM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరనున్నాయి.

కొలువుదీరనున్న ఏఎంసీ పాలకవర్గాలు

- నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు

- ప్రస్తుతం గజపతినగరం, కొత్తవలస మార్కెట్‌ కమిటీలకే అవకాశం

-ఈ నెలాఖరులోగా మిగతా వాటికి

విజయనగరం రూరల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గాలు త్వరలో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు పాలకవర్గాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో విజయనగరం, పూసపాటిరేగ, చీపురుపల్లి, మెరకముడిదాం, బొబ్బిలి, గజపతినగరం, కొత్తవలస, రాజాం మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఈ ఎనిమిది మార్కెట్‌ కమిటీలకు సంబంధించి చైర్మన్‌ అభ్యర్థులను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మిగతా పాలకవర్గ సభ్యుల జాబితాను కూడా సిద్ధం చేసి పంపాలని ఆదేశించడంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు వాటిని పంపారు. ఈ జాబితా ఇప్పటికే అమరావతికి చేరుకుంది. అయితే, గజపతినగరం, కొత్తవలస మార్కెట్‌ కమిటీల పాలకవర్గాల నియామకానికి మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గజపతినగరం ఏఎంసీ పాలకవర్గం ఈ నెల 30న కొలువ దీరనుంది. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా కొత్తవలస ఏఎంసీ పాలకవర్గం కూడా ఇదే నెలలో కొలువు దీరనుంది. మిగతా మార్కెట్‌ కమిటీలకు సంబంధించి ఈ నెలఖరులోగా ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏడాది పాలన నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలు అంతా అమరావతిలో ఉన్నారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల జీవోలకు సంబంధించి వారు ఉన్నతాధికారులతో మాట్లాడడంతో ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దీంతో జిల్లాలోని మిగతా ఆరు ఏఎంసీల పాలకవర్గాల నియామకానికి త్వరలో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏఎంసీ పాలకవర్గాలు కొలువుదీరనుండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 25 , 2025 | 12:01 AM