Share News

కొత్త గురువులకు పాఠశాలల కేటాయింపు

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:30 PM

Allocation of Schools to New Teachers మెగా డీఎస్సీలో పోస్టులు సాధించిన కొత్త గురువులకు పాఠశాలల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో కొద్దిరోజులుగా వారికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 266 ఎస్జీటీలకు శిక్షణ కేంద్రంలో మాన్యువల్‌గా కౌన్సిలింగ్‌ నిర్వహించి పాఠశాలలు, క్లస్టర్‌ పోస్టులను కేటాయించారు.

కొత్త గురువులకు పాఠశాలల కేటాయింపు
శిక్షణ పూర్తి చేసిన టీచర్‌కు ధ్రువపత్రం అందిస్తున్న విజయనగరం డీఈవో మాణిక్యంనాయుడు

సాలూరు రూరల్‌, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో పోస్టులు సాధించిన కొత్త గురువులకు పాఠశాలల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. డెంకాడ మండలం మోదవలస ఓయోస్టార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో కొద్దిరోజులుగా వారికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 266 ఎస్జీటీలకు శిక్షణ కేంద్రంలో మాన్యువల్‌గా కౌన్సిలింగ్‌ నిర్వహించి పాఠశాలలు, క్లస్టర్‌ పోస్టులను కేటాయించారు. పాఠశాల సహాయకులకు వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించినందున వారికి ఈ నెల 11న పాఠశాలలను కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 266 ఎస్జీటీలు, పాఠశాల సహాయకుల విభాగంలో సోషల్‌ స్టడీస్‌ 67, ఫిజిక్స్‌ 56, బయాలజీ 36, గణితం 33, తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 30, ఫిజికల్‌ డైరెక్టర్‌ 62 పోస్టులకు కొత్త ఉపాధ్యాయులకు పాఠశాలలను కేటాయించనున్నారు. కాగా వారంతా ఈ నెల 13న విధుల్లో చేరనున్నారు.

మెగా డీఎస్సీలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 583 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ పోస్టులకు 18001 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌6 నుంచి జూలై 2 వరకు ఉపాధ్యాయ పోస్టులకు సీబీటీ ద్వారా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక, తుది కీలను విడుదల చేశారు. ఆగస్టులో వ్యక్తిగత మార్కులు, అనంతరం మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. టీచర్‌ పోస్టులకు ఎంపికైన 578 మందితో (ఐదు పోస్టులు అభ్యర్థుల్లేక ఖాళీగా ఉండిపోయాయి.) జాబితాను గత నెల 15న ప్రకటించారు. వారికి అమరావతిలో గత నెల 25న సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖామంత్రి లోకేశ్‌ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చారు. అనంతరం వారికి డెంకాడ మండలం మోదవలసలో ఈ నెల 3 నుంచి శిక్షణ కార్యక్రమం ఆరంభించారు.

Updated Date - Oct 10 , 2025 | 11:30 PM