Share News

irrigation ఇక సాఫీగా!

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:37 PM

All Smooth Now! ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటికి ఆటంకం కలగ కుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్‌ అండ్‌ మెంటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టుల పరిధిలోని కాలువ లైనింగ్‌లు, ఇతరత్రా అత్యవసర పనులు నీటి సంఘాల ఆధ్వర్యంలో చురుగ్గా జరుగుతున్నాయి. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 irrigation ఇక సాఫీగా!
చినమేరంగి సమీపంలో కాలువ పనులు చేపడుతున్న దృశ్యం

  • ఉమ్మడి జిల్లాకు రూ. 2.61 కోట్లు మంజూరు

జియ్యమ్మవలస, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటికి ఆటంకం కలగ కుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్‌ అండ్‌ మెంటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టుల పరిధిలోని కాలువ లైనింగ్‌లు, ఇతరత్రా అత్యవసర పనులు నీటి సంఘాల ఆధ్వర్యంలో చురుగ్గా జరుగుతున్నాయి. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిధిలో వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్‌, జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 2.45 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. కాగా చిన్న , మధ్య తరహా ప్రాజెక్టులైన వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్‌ ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టులు, వాటి పరిధిలో కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. శివారు భూములకు సాగునీరు అందడం గగనమైపోయింది. ఈ క్రమంలో ఏటా రైతులు వరుణుడిపై ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తోంది. వారి కష్టాలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, పెదంకలాం, వట్టిగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో తాత్కాలిక పనులు చేయాలని సంకల్పించింది. ఇందుకు గాను ఆపరేషన్‌ అండ్‌ మెంటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కింద రూ.2.61 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో సాగునీటి ప్రాజెక్టు కమిటీల ద్వారా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే జంఝావతి, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి పారుదలశాఖ అధికారులు సాగునీటిని విడుదల చేశారు.

మండలాల వారీగా

పార్వతీపురం మండలంలో 13 పనులకు గాను రూ. 29 లక్షలు, సీతానగరంలో 14 పనులకు రూ. 41 లక్షలు, బలిజిపేటలో 13 పనులకు రూ. 29 లక్షలు, సాలూరులో రెండు పనులకు రూ. 5.96 లక్షలు, మక్కువలో ఆరు పనులకు రూ. 25.94 లక్షలు కేటాయించారు. కురుపాం మండలంలో ఒక పనికి రూ. 8.5 లక్షలు, గుమ్మలక్ష్మీపురంలో ఒక పనికి రూ. 2.5 లక్షలు మంజూరయ్యాయి. జియ్యమ్మవలస మండలంలో 14 పనులకు రూ. 39.02 లక్షలు, కొమరాడలో రెండు పనులకు రూ. 5 లక్షలు, వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో 17 పనులకు రూ. 62 లక్షలు, రామభద్రపురంలో ఏడు పనులకు రూ. 13 లక్షలు మంజూరు చేశారు.

నిధులు మంజూరయ్యాయి

సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో అవసరమైన పనులకు గాను ప్రభుత్వం రూ. 261.10 లక్షలు మంజూరు చేసింది. చురుగ్గా పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా 90 పనులు పూర్తి చేయాల్సి ఉంది.

- ప్రదీప్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, నీటి పారుదలశాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - Jul 23 , 2025 | 11:37 PM