Yoga Day యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:11 AM
All Set for Yoga Day అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో యోగాంధ్ర కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్షించారు.
5.40 లక్షల మందితో ‘యోగాంధ్ర’కు ఏర్పాట్లు పూర్తి
ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు
పార్వతీపురం, జూన్ 20 (ఆంరఽధజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో యోగాంధ్ర కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ విశాఖలో ఐదు లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించబోతున్నారు. అదే విధంగా మన్యం జిల్లాలో కూడా 5.40 లక్షల మందితో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నమోదు చేసుకున్న ప్రజలను యోగాంధ్రాలో పాల్గొనేలా చూడాలి. ముందుగా గుర్తించిన 3,150 ప్రదేశాల్లో ఆసనాలు వేసేందుకు వీలుగా జంగిల్ క్లియరెన్స్ చేయించి చదును చేయించాలి. మ్యాట్స్ తప్పనిసరిగా వేయించాలి. వేదిక వద్ద ఉదయం ఆరు గంటలకు అందరూ సిద్ధంగా ఉండాలి.’ అని తెలిపారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్‌రావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఐటీడీఏ ఏపీడీ మురళీధర్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
పార్వతీపురంటౌన్: జిల్లా కేంద్రం పార్వతీపురంలో శనివారం నిర్వహించనున్న యోగాంధ్ర ప్రదేశాలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. బెలగాం రైల్వే స్టేషన్ పార్కుతో పాటు చర్చివీధిలోని ఉద్యానవనాన్ని సందర్శించారు. అనంతరం జగన్నాఽథపురం ప్రాథమికోన్నత పాఠశాల, దేవాంగుల వీధిలో యోగా నిర్వహణ ప్రాంతాన్ని పరిశీలించి.. ఏర్పాట్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఉన్నారు.
విశాఖకు తరలివెళ్లిన రాష్ట్రస్థాయి విజేతలు
పార్వతీపురం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లావాసులు విశాఖకు పయనమయ్యారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక బస్సులో వారంతా బయల్దేరి వెళ్లారు. శనివారం విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనున్నారు. విజేతలను ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించే అవకాశం ఉంది. వారి వెంట ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, జిల్లాపబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ రఘు, ఆయుష్ డిపార్ట్ మెంట్ కన్వీనర్ వర్మ తదితరులు ఉన్నారు.
సబ్‌జైళ్లలో నిర్వహించాలి
పాలకొండ: జిల్లాలోని అన్ని సబ్‌జైళ్లలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని జిల్లా సబ్‌జైలు శాఖాధికారి కె.మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం పాలకొండలోని సబ్‌జైలును సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం అర్ధవార్షిక తనిఖీ చేపట్టారు. రిమాండ్ ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని జైలు సూపరింటెండెంట్ బి.జోగులును ఆదేశించారు.
జిల్లా నుంచి 165 ఆర్టీసీ బస్సులు
పార్వతీపురంటౌన్/ సాలూరు రూరల్: విశాఖపట్నంలో శనివారంజరగనున్న యోగాంధ్ర వేడుకలకు జిల్లా నుంచి 165 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో అంతర్జాతీయయోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రికార్డు స్థాయిలో యోగా చేసేందకు జనం రానున్నారు. వారందరికీ ప్రయాణ ఇబ్బందుల్లేకుండా ఇప్పటికే జిల్లా నుంచి బస్సులను తరలించారు. సాలూరు డిపో నుంచి 52 , పార్వతీపురం నుంచి 56 , పాలకొండ నుంచి 57 బస్సులు పంపించారు. ఈ బస్సుల ద్వారా అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు గ్రామాల నుంచి యోగా చేసే వారిని విశాఖకు తరలించి, మళ్లీ తీసుకురానున్నాయి. జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులు సైతం తరలివెళ్లాయి.