శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:16 AM
All Set for Sharannavaratri Celebrations ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కోర్కెలు తీర్చే పాలకొండ కోటదుర్గమ్మ శరనన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి అక్టోబరు 2 వరకు వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఘటాలు, ముర్రాటలతో సామూహిక సంబరాలు చేయడం ఈ ప్రాంత వాసులకు ఆనవాయితీ.
నేడు నిజరూప దర్శనం
అక్టోబరు 2 వరకు ప్రత్యేక పూజలు
పాలకొండ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కోర్కెలు తీర్చే పాలకొండ కోటదుర్గమ్మ శరనన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి అక్టోబరు 2 వరకు వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఘటాలు, ముర్రాటలతో సామూహిక సంబరాలు చేయడం ఈ ప్రాంత వాసులకు ఆనవాయితీ. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పందిళ్లను ఏర్పాటు చేశారు. తాగునీరు, మజ్జిగతో పాటు ప్రాథమిక చికిత్స శిబిరం అందుబాటులో ఉంచారు. కాగా సోమవారం తొలిరోజు అమ్మవారి నిజరూపంలో దర్శనమివగా.. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూలైన్లు, టెంట్లు సిద్ధం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిజరూపంలో అమ్మవారు దర్శనం ఇవ్వ నుంది. సాయంత్రం ప్రత్యేక అలంకరణలో దర్శనమివ్వనుంది. అంతకుముందు బేరి కుటుంబ సభ్యులతో ముహూర్తపురాట నిర్వహిస్తారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు.
నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు...
నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 22న బాలాత్రిపుర సుందరీదేవిగా, 23న గాయత్రి దేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న కాత్యాయినీదేవి, 26న మహాలక్ష్మీ దేవి, 27న లలిత త్రిపురసుందరీదేవి, 28న మహాచండీదేవి, 29న మహాసరస్వతిదేవి, 30న దుర్గా దేవి, అక్టోబరు 1న మహిషాసురమర్దని దేవి, 2న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది.
సాంస్కృతిక కార్యక్రమాలు
రోజూ రాత్రి నుంచి ఏడు నుంచి 9 వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు చిన్నపాటి వేదికను ఏర్పాటు చేశారు. పశువైద్యశాల పక్కనే ఉన్న విశాలమైన ప్రాంగణంలో మరో పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. అక్కడ రాత్రి 9 గంటల తర్వాత ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమ్మ వారి కల్యాణ మండపం సమీపంలో భక్తులకు అన్నసమారాధన కార్య క్రమం చేపట్టనున్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో ఈవీ సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
క్యూలైన్‌లు ఇలా....
కోటదుర్గమ్మ ఆలయం తూర్పు ప్రధాన గోపురం నుంచి ఆలయం లోపలకు చేరుకునేందుకు వీలుగా కొత్తగా ద్వారం ఏర్పాటు చేశారు. అదే క్యూలైన్‌లో ఘటాలతో వచ్చేవారికి, వంద రూపాయల ప్రత్యేక దర్శనం వారికి అనుమతిస్తారు. ఆ పక్కనే ఉచిత, రూ.30, శీఘ్ర దర్శనం, వృద్ధులు, దివ్యాంగులకు మరో మూడు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు తూర్పుగోపురంలో మరో మార్గం ద్వారా బయటకు వచ్చేలా క్యూలైన్ ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు దక్షిణ ప్రధాన గోపురం ద్వారా దర్శనాలు కల్పిస్తారు.
150 మందితో బందోబస్తు
ఉత్సవాల కోసం 150 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ ఎం.రాంబాబు తెలిపారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. దసరా నవరాత్రులు ముగిసే వరకు ఇది కొనసాగుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వాహనాలను నిలుపుదల చేయాలని సూచించారు. భక్తులపై మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి తెలిపారు. డ్రోన్లు, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిరంతరం ప్రత్యేక కంట్రోల్ నుంచి ఉత్సవాలను పర్యవేక్షిస్తామన్నారు.