Share News

Paddy Procurement ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:13 AM

All Set for Paddy Procurement జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 15 మండలాల పరిధిలోని 281 రైతుసేవా కేంద్రాల్లో 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి అవసరమైన సిబ్బందిని నియమించారు.

 Paddy Procurement  ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం
సుంకి సమీపంలో ధాన్యం నిల్వలు ఆరబెట్టిన రైతులు

  • పంట నిల్వలు సిద్ధం చేస్తున్న రైతులు

గరుగుబిల్లి, నవంబరు15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 15 మండలాల పరిధిలోని 281 రైతుసేవా కేంద్రాల్లో 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి అవసరమైన సిబ్బందిని నియమించారు. గోనె సంచులు, హమాలీలు, రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. వాస్తవంగా ఈ ఏడాదిలో ఖరీఫ్‌ రైతులు 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఈ నేపథ్యంలో సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా. గతేడాది 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర కొనుగోలు చేశారు. ఈ ఏడాది అదనంగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 17 నుంచి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైస్‌ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన తరువాతే రైతుల ఖాతాల్లోకి నగదు జమయ్యే అవకాశం ఉంది. అయితే జిల్లాలో మిల్లర్లదే ఆలస్యం. వారు బీజీ ఇచ్చిన వెంటనే ప్రక్రియ వేగవంతం కానుంది.

రైతులు సన్నద్ధం

రైతులు ధాన్యం నిల్వలను సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు గ్రామాల్లో యంత్రాల సాయంతో నూర్పులు చేసి శుభ్రపర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. మరికొన్నిచోట్ల నిల్వలను ఆరబెట్టి బస్తాలలోకి నింపుతున్నారు. తేమ శాతంతో పాటు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు.

24 గంటల్లోనే నగదు జమ

ధాన్యం కొనుగోలుకు సంబంధించి మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. సుమారు 196 మిల్లుల నుంచి రూ. 150 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీలు రావాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమేర మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ అందించారు. సోమవారానికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. గతంలో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైతుసేవా కేంద్రాల పరిధిలో అన్నదాతలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తాం. దళారులు రైతులకు వద్దకు చేరకుండా చర్యలు చేపట్టాం. దీనిపై మండల స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశాం.

- కె.శ్రీనివాస్‌, మేనేజర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ, పార్వతీపురం మన్యం

=============================

పత్తి కొనుగోలుకు సిద్ధం

పార్వతీపురం రూరల్‌, నవంబరు15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి సాలూరు , భామినిలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్‌ అధికారి ఆర్‌ఆర్‌.యేసురాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పొట్టి పింజను క్వింటా రూ.77,10 చొప్పున కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. రైతులు తమ మొబైల్‌ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని శ్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:13 AM