Minister Lokesh's Tour మంత్రి లోకేశ్ పర్యటనకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:40 AM
All Set for Minister Lokesh's Tour రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం జిల్లాకు రానున్నారు. జిల్లాకేంద్రం పార్వతీపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
పార్వతీపురంలో విద్యార్థులతో ముఖాముఖి
టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మెరిసిన వారికి పురస్కారాల ప్రదానం
చినబొండపల్లిలో క్లస్టర్, బూత్ ఇన్‌చార్జిలతో ప్రత్యేక సమావేశం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పార్వతీపురం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం జిల్లాకు రానున్నారు. జిల్లాకేంద్రం పార్వతీపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మంత్రి లోకేశ్ జిల్లాకు వస్తుండడంతో ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా మూడోసారి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లోనూ ముందంజలోనే ఉంది. ఈ నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరిట మంత్రి పురస్కారాలు అందించనున్నారు. మన్యం జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం పార్వతీపురంలోని రాయల్ కన్వెన్షన్ హాల్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులతో మంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్వతీపురం మండలం చినబొండపల్లిలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించ నున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు గ్రామ కమిటీలు, క్లస్టర్, బూత్ ఇన్‌చార్జిలు, కుటుంబ సాధికారిక సభ్యులతో మాట్లాడనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఏడాది పాలనలో సాధించిన ఫలితాలు , అభివృద్ధి కార్యక్రమాలు, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, భవిష్యత్‌లో ఏ ఎన్నికలు జరిగినా.. ఎలా సమాయత్తం అవ్వాలనే దానిపై మంత్రి చర్చిస్తారని సమాచారం. సాధారణ ఎన్నికల్లో కష్టపడి పార్టీను ముందుకు నడిపించిన ముఖ్య కార్యకర్తలకు లోకేశ్ చేతుల మీదుగా సత్కరించనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనున్నారు.
ఘన స్వాగతానికి సన్నాహాలు
సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద మంత్రి లోకేశ్‌కు మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణలు ఘన స్వాగతం పలకనున్నారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
122 మంది ‘షైనింగ్ స్టార్స్’
జిల్లాలో 122 మంది విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్ ’ పేరిట మంత్రి లోకేశ్ పురస్కారాలతో పాటు నగద కూడా అందించనున్నారు. టెన్త్‌లో 96 మంది, ఇంటర్‌లో 26 మంది విద్యార్థులున్నారు.
ఇన్నోవేటివ్ హబ్‌కు శంకుస్థాపన
పార్వతీపురం పట్టణంలో నిర్మించనున్న ఇన్నోవేటివ్ హబ్‌కు మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. షైనింగ్ స్టార్స్ కార్యక్రమం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు. నీతి అయోగ్ అందించిన రూ.3 కోట్లతో దానిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
పార్వతీపురం/టౌన్: మంత్రి నారా లోకేశ్ జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 370 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారిని ఎనిమిది సెక్టార్లుగా విభజించామన్నారు. ఏఎస్సీ అంకితసురాన పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఆయన వెంట పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ ధామన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
టూర్ షెడ్యూల్ ఇదీ..
మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉదయం 8.40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా పార్వతీపురం రాయల్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం మండలం చినబొండపల్లి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. రాత్రి ఏడు గంటల వరకు పార్టీ శ్రేణులతో మంత్రి సమావేశం కానున్నారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా విశాఖపట్నం పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటారు. ఇదిలా ఉండగా పార్వతీపురంలో ప్రత్యామ్నాయంగా హెలీప్యాడ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.