Grain Procurement ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:05 AM
All Set for Grain Procurement జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రవాణా, హమాలీలు, వాహనాలు గోనె సంచులను సిద్ధం చేశారు. అవసరమైన సిబ్బందిని కూడా నియమించారు. ఏదేమైనా వచ్చేవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికా రులు వెల్లడిస్తున్నారు.
వచ్చే వారంలో ప్రారంభం
సిబ్బంది నియామకం పూర్తి
మిల్లులకు చేరిన గోనె సంచులు
వాహనాలు, హమాలీలు సన్నద్ధం
పార్వతీపురం/గరుగుబిల్లి, నవంబరు9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రవాణా, హమాలీలు, వాహనాలు గోనె సంచులను సిద్ధం చేశారు. అవసరమైన సిబ్బందిని కూడా నియమించారు. ఏదేమైనా వచ్చేవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికా రులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఈ-క్రాప్ నమోదు పూర్తయింది. కాగా రైతుసేవా కేంద్రాల నుంచి ఈ సీజన్‌లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పీఏసీఎస్‌లు, ఆర్‌ఎస్‌కేల వద్ద సుమారు 180 ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ)ను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ముగ్గురు చొప్పున టీఏలు, డీఈవోలు, సహాయకులను నియ మించారు.ధాన్యం కొనుగోలు , ఇతర అంశాలపై ఇప్పటికే వారికి శిక్షణ అం దించారు. వారు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల ఆర్‌ఎస్‌కే నుంచి పీపీసీ మధ్య 24,776.8 కిలో మీటర్ల మేర దూరం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు రైతులకు ఇబ్బంది లేకుండా రవాణా, హమాలీలను సిద్ధం చేశారు. మొత్తంగా 2.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ముందస్తు కొనుగోలుకు అధికారులు నిర్ణయించారు.
పర్యవేక్షణకు సిబ్బంది
ఆర్‌ఎస్‌కేలో రైతులు ధాన్యం అప్పగించిన తర్వాత అవి రైస్ మిల్లులకు చేరే వరకు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షించనున్నారు. తహసీల్దార్, సివిల్ సప్లైస్ డీటీ, ఏవో, వీఆర్‌వో, వ్యవసాయ సిబ్బంది, ఇతర సచివాలయాల సిబ్బంది పర్యవేక్షణలో ధాన్యం తరలింపు జరగనుంది.
వాహనాలకు రిజిస్ట్రేషన్
జిల్లాలోని 180 కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యం తరలింపు వాహ నాల రిజిస్ట్రేషన్లు పూర్తికావచ్చాయి. ఆర్‌ఎస్‌కేల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించనున్నారు.
పీఏసీఎస్‌ల్లో పాత సంచులు
ప్రస్తుతం 21 లక్షలకు పైగా గోనె సంచులను సిద్ధం చేశారు. అయితే గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా రైతులకు నాణ్యమైన సంచులు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దీంతో మిల్లర్లు కొత్తవి కొన్నారు. ఇటీవల జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి పార్వతీపురం మండలం అడ్డాపుశీల వద్ద రైస్ మిల్లులో గోనె సంచులను పరిశీలించారు. అయితే జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పాత గోనె సంచులే దర్శనమిస్తున్నాయి. అధిక శాతం పనికి రాని విధంగా తయార య్యాయి. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టార్పాలిన్లు సిద్ధం
రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల్లో టార్పాలిన్లు సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో వర్షాలు కురిసినట్లయితే నిల్వలు తడిసిపోకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ముంచిన తుఫాన్..
మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో చాలాచోట్ల ధాన్యం నిల్వలు తడిసిపో యాయి. దీంతో రైతులు వాటిని ఇతర జిల్లాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు 80 కిలోల కామన్ రకం ధాన్యం బస్తాను రూ.1350కు కొనుగోలు చేస్తున్నారు. పార్వతీపురం, బలిజిపేట, పాలకొండ తదితర మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆరబెట్టిన ధాన్యానికి మరో రూ.వంద అదనంగా జోడించి వ్యాపారులు రైతులకు చెల్లిస్తున్నారు. పంటను నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులకే ధాన్యం విక్రయిం చాల్సి వస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో వచ్చేవారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ లోపు రైతులు తొందరపడకుండా ఉంటే వారి శ్రమకు తగిన ఫలితం దక్కుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రారంభమైన వరి కోతలు
మక్కువ రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమ య్యాయి. ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మక్కువ మండలంలో సుమారు 12వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టగా.. 25వేల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలో 14 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. కాగా గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు.
వచ్చేవారం ప్రారంభం
వచ్చేవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. ఈ లోపుగా ధాన్యం నిల్వలను ఎలా భద్రపరచుకోవాలో ఇప్పటికే వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా రైతులకు అవగాన కల్పించాం.
- యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్
====================================
నిబంధనల మేరకు..
నిబంధనలు, నాణ్యతా ప్రమాణాల మేరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తాం. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ అందించాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. తేమ శాతం 17లోపు ఉండేలా రైతులు చూసుకోవాలి. సాధారణ రకం క్వింటా రూ. 2,369, గ్రేడ్-ఏ రకం క్వింటా రూ.2,389గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు మొత్తం జమవుతుంది.
- కె.శ్రీనివాస్, మేనేజర్, సివిల్ సప్లైస్, పార్వతీపురం మన్యం జిల్లా