Only Tears Remain! ఆశలన్నీ నేలరాలి.. కన్నీరే మిగిలి..!
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:39 AM
All Hopes Shattered… Only Tears Remain! అతి వేగంతో వెళ్తున్న ఓ లారీ.. ముగ్గురు యువకుల ప్రాణాన్ని బలిగింది. వారి తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేసింది. తీరన్ని శోకం.. కన్నీళ్లనే మిగిల్చింది. కూనేరు అంతరాష్ట్ర రహదారి.. కొమరాడ ఏపీటీడబ్ల్యూ బాలుర పాఠశాల, కొమరాడ పోలీస్‌స్టేషన్ మధ్యలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
స్కూటీని వెనుక నుంచి ఢీ కొట్టిన లారీ
ముగ్గురు యువకుల మృతి
వారిలో ఇద్దరు అన్నదమ్ములు
తీవ్ర విషాదంలో గిరిజన కుటుంబాలు
కొమరాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అతి వేగంతో వెళ్తున్న ఓ లారీ.. ముగ్గురు యువకుల ప్రాణాన్ని బలిగింది. వారి తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేసింది. తీరన్ని శోకం.. కన్నీళ్లనే మిగిల్చింది. కూనేరు అంతరాష్ట్ర రహదారి.. కొమరాడ ఏపీటీడబ్ల్యూ బాలుర పాఠశాల, కొమరాడ పోలీస్‌స్టేషన్ మధ్యలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూటీని వెనుక వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆయా గిరిజన కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకేసారి ఇద్దరు పిల్లలను ఓ కుటుంబం, ఉన్న ఒక్కగానొక్క తనయుడిని మరో కుటుంబం కోల్పోయింది. ముగ్గురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం..
కొమరాడ మండలం నాగావళి నది అవతల ఉన్న కెమిశీల పంచాయతీ కొరిశిల గిరిజన గ్రామానికి చెందిన సిగురు కార్తీక్ (21), సిగురు ఉదయ్‌కిరణ్(19) అన్నదమ్ములు. వారి తండ్రి పురపాలు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. తల్లి లేకపోవడంతో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుని బతుకుతున్నాడు. కార్తీక్ బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. సెలవులు కావడంతో ఇటీవల గ్రామానికి వచ్చాడు. ఉదయ్‌కిరణ్‌కు ఇంటర్ పూర్తయ్యింది. విజయనగరం మహారాజ కళాశాలలో డిగ్రీ చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా వీరి ఎదురింటిలో ఉంటున్నాడు దువ్వాన జగన్ (17). కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి తండ్రి కృష్ణ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఆయా కుటుంబాలకు వారే ఆధారం.
గుమడా రైల్వేస్టేషన్‌కు వెళ్దామని..
కార్తీక్ , ఉదయ్‌కిరణ్‌కు జగన్ మంచి మిత్రుడు. ఒకే వీధి.. ఎదురెదురు ఇళ్లు కావడంతో చిన్నతనం నుంచి వారు కలిసిమెలిసి పెరిగారు. కాగా కార్తీక్ సోమవారం బొబ్బిలి ఐటీఐ కళాశాలకు వెళ్లాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో మరొకరి స్కూటీ అడిగి ముగ్గురూ గుమడా రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. కార్తీక్‌కు అక్కడ దింపి మిగతా ఇద్దరూ స్వగ్రామాలకు తిరిగి చేరుకోవాలనుకున్నారు. కానీ విధి వారిపై చిన్నచూపు చూసింది. మరో 5 నిమిషాల్లో వారు రైల్వే స్టేషన్‌కు వెళ్తారనగా.. లారీ రూపంలో మృతువు కబళించింది. ఆయా కుటుంబాలకు తీరిన శోకాన్ని మిగిల్చింది. ముగ్గురు యువకులు స్కూటీపై కూనేరు నుంచి కొమరాడ వైపు వస్తుండగా అదే సమయంలో ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ఆపకుండా వెళ్లకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్‌కు సమీపంలో జరగడంతో కొమరాడ పోలీసులు వెంటనే స్పందించి గంగరేగువలస గ్రామ సమీపంలో లారీ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తమ బిడ్డల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. అప్పటివరకు తమతో గడిపిన వారు విగతజీవుల్లా మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోవిందరావు, ఎస్‌ఐ కె.నీలకంఠం తెలిపారు.