Share News

Alert over Heavy Rains భారీ వర్షాలపై అప్రమత్తం

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:39 PM

Alert over Heavy Rains జిల్లాలో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Alert over Heavy Rains భారీ వర్షాలపై అప్రమత్తం
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నదులు, కాలువలు, చెరువులు తదితర జలవనరుల్లో ఎవరూ దిగకుండా చూడాలన్నారు. రహదారులు, కల్వర్టులపై నుంచి నీరే పారే చోట్ల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని , గ్రామాల్లో పారిశుధ్య మెరుగు పనులు చేపట్టాలని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలన్నారు. ఖరీఫ్‌ రైతులకు తగు సలహా, సూచనలు ఇవ్వాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. తాగునీరు , విద్యుత్‌ సరఫరా , ఆసుపత్రుల అత్యవసర విభాగాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గర్భిణులను ముందస్తుగా ఆసుపత్రులు, వసతిగృహాలకు తరలించాలన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని తెలిపారు. వీఆర్‌వోలు ప్రధాన కేంద్రాల్లో ఉండి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌

జిల్లాలో ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాలువల్లో పూడికలు తీయాలని, మరుగునీరు ఎక్కడ నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో మరింత సమర్థవంతంగా డ్రైవ్‌ను నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ జరగాలని, వాటిని చెత్త సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రైడే నిర్వహించాలన్నారు. నీటి నిల్వ అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. మురుగుకాలువల్లో ఆయిల్‌బాల్స్‌ వేసి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాల దగ్గరలో ఉండే నీటి వనరుల్లో గంభూజియా చేపలను పెంచాలని, ప్రతి ఇంటిలోనూ, స్ర్పేయింగ్‌ చేపట్టాలని సూచించారు. దోమతెరల వినియోగం, ప్రయోజనాలపై గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు.

నేడు సీనియర్‌ సిటిజన్ల యోగా

యోగాంధ్రలో భాగంగా ఆదివారం సీనియర్‌ సిటిజన్లతో యోగా కార్యక్రమం నిర్వహించ నున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండ పరిధిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా సాయి పోటీలు జరుగుతాయన్నారు.

9న నియోజకవర్గం విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ విడుదల

నియోజకవర్గం విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా యాక్షన్‌ ప్లాన్‌ను ఆవిష్కరించనున్నారని వెల్లడించారు. అనంతరం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Updated Date - Jun 07 , 2025 | 11:40 PM