Share News

Alert on Malaria మలేరియాపై అప్రమత్తం

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:14 PM

Alert on Malaria మలేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గిరిజన గ్రామాల్లో కేసులు నమోదు కాకుండా చూడాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

Alert on Malaria మలేరియాపై అప్రమత్తం
మలేరియా వ్యాప్తిపై సమీక్షిస్తున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి

సీతంపేట రూరల్‌,ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): మలేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గిరిజన గ్రామాల్లో కేసులు నమోదు కాకుండా చూడాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ‘ ఏజెన్సీ గ్రామాల్లో మలేరియా ఎక్కువగా ఉంటుంది. దానిని నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వ్యాధి వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగు వంటి వాటిపై పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. గిరిజన గ్రామాల్లో తరుచూ వైద్య పరీక్షలు నిర్వహించాలి. మలేరియా పరీక్షలకు సంబంధించి కిట్లను ఏఎన్‌ఎంలకు అందించాలి. పాజిటివ్‌ వచ్చిన రోగులకు వెంటనే చికిత్స ప్రారంభించాలి. సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులకు రిఫర్‌ చేయకుండా పీహెచ్‌సీ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందించాలి. మందుల కొరత లేకుండా చూస్తాం. మలాథిన్‌ స్ర్పెయింగ్‌ అన్ని గ్రామాల్లో చేయించాలి. దీనిని సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలి. పాజిటివ్‌ వచ్చిన రోగితో పాటు ఆ సమీపంలోని పది కుటుంబాలకు చెందిన సభ్యులకు కూడా మలేరియా పరీక్షలు నిర్వహించాలి. మైనింగ్‌ కోసం కొండలను తవ్వే క్రమంలో ఏర్పడిన గోతుల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి.’ అని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, డీఎంవో సత్యనారాయణ, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ శాఖాధికారులు, సీడీపీవో, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:14 PM