Alert in temples ఆలయాల్లో అలెర్ట్
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:08 PM
Alert in temples శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట నేపథ్యంలో జిల్లాలో అన్ని ఆలయాల్లో సిబ్బంది, కమిటీలు అలెర్ట్ అయ్యాయి. కార్తీక మాసం రెండో సోమవారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బారికేడ్లను మరింత విశాలంగా ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కూడా నిఘా పెట్టారు. ప్రతి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకుంటే తక్షణం మార్పించే చర్యలు చేపట్టారు.
ఆలయాల్లో అలెర్ట్
కాశీబుగ్గ ఘటనతో ఏర్పాట్లపై దృష్టి
బారికేడ్లను విశాలంగా నిర్మిస్తున్న నిర్వాహకులు
నిఘా పెట్టిన అధికారులు
ఎక్కడికక్కడ తనిఖీలు
విజయనగరం/ బొబ్బిలి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట నేపథ్యంలో జిల్లాలో అన్ని ఆలయాల్లో సిబ్బంది, కమిటీలు అలెర్ట్ అయ్యాయి. కార్తీక మాసం రెండో సోమవారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బారికేడ్లను మరింత విశాలంగా ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కూడా నిఘా పెట్టారు. ప్రతి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకుంటే తక్షణం మార్పించే చర్యలు చేపట్టారు. జిల్లాలో రామనారాయణం, జ్ఞాన సరస్వతి తదితర ఆలయాలు ప్రైవేటు ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిపై దేవదాయశాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. రామనారాయణం దేవస్థానానికి ఉభయ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే ఇంతవరకూ ఎటువంటి అపశృతులు జరగలేదు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనతో మరిన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖద్వారాలతో పాటు క్యూ లైన్‌లు ఎక్కువ విస్తీర్ణంలో ఉండేట్లు చూడాలని చెప్పింది. భక్తుల రాకపై అంచనా ఉండాలని, ఆ వివరాలను పోలీసులకు ఇవ్వాలని నిర్దేశించింది. అయితే ప్రత్యేక పర్వదినాల్లో భక్తులను నియంత్రించేందుకు తగినంత మంది సిబ్బంది లేరని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పర్యవేక్షణకు కీలక అధికారులు ఐదుగురే ఉన్నారు. ఈవోలు కూడా పరిమిత స్థాయిలోనే కొనసాగుతున్నారు. ఒక్కొక్కరికీ నాలుగు నుంచి ఐదు దేవస్థానాల బాధ్యతలు అప్పగిస్తున్నారు.
- రెండో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడడం సర్వసాఽధారణం. బొబ్బిలి పట్టణ పరిధిలో దేవాదాయశాఖ పరిధిలో వేణుగోపాలస్వామి ఆలయం, దిబ్బవీధి శివాలయం ఉన్నాయి. ఏకాదశి సందర్భంగా శనివారం ఈ రెండు ఆలయాల్లో వేల సంఖ్యలో భక్తులు బారులుతీరారు. సోమవారం దర్శనానికి వచ్చే భక్తుల కోసం బ్యారికేడ్లు, క్యూలైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే బొబ్బిలి పూల్‌బాగ్‌లో పురాతనమైన జంగాల శివాలయం ఉంది. ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ కూడా భక్తుల రద్దీ పెరిగితే ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
పోలీసుల సహకారం తీసుకుంటున్నాం
రాజకుమారి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టరు, బొబ్బిలి డివిజన్
బొబ్బిలి పట్టణంలో చారిత్రాత్మకమైన దేవాలయం వేణుగోపాలస్వామి ఆలయం. ఇక్కడ పవిత్ర దినాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దిబ్బవీధి శివాలయం నిర్వహణ అర్చకులకు అప్పగించాం. భక్తుల కమిటీ పర్యవేక్షిస్తుంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసు సహకారం కూడా తీసుకుంటున్నాం.
నిరీక్షణ లేకుండా చూడాలి
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
ఆలయాల ప్రధాన ద్వారంతో పాటు క్యూ లైన్లలో మార్పులు చేయాలని చెప్పాం. తద్వారా భక్తుల నిరీక్షణ తగ్గుతుంది. కార్తీకమాసం కావడంతో అన్ని ఆలయాల్లో రద్దీ ఉంటుంది. ఎంత సంఖ్యలో వచ్చినా సులువుగా దర్శనానికి పంపేలా చూడాలని ఆదేశించాం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆలయాల విషయంలో కీలక సూచనలు చేశాం. అన్ని ఆలయాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి తగిన ఆదేశాలు ఇచ్చాం.
పోలీసులను అప్రమత్తం చేశాం
ఎస్పీ ఏఆర్ దామోదర్
ఆలయాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేదా అనేదానిపై పోలీసులను అప్రమత్తం చేశాం. సిబ్బంది నిరంతరం ఆలయాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. తగిన సూచనలు ఇస్తున్నారు. క్యూలైన్లు, ప్రధాన ద్వారాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని చెప్పాం.