Alas… The Farmer! అయ్యో.. అన్నదాత!
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:43 AM
Alas… The Farmer! జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా పంట చేతికందొచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించలేక.. పెట్టుబడులను సైతం పొందలేక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు.
ఏటా వరుస తుపాన్లతో బెంబేలు
మొన్న మొంథా.. నిన్న దిత్వా
నష్టపోతున్న రైతులు
పార్వతీపురం, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా పంట చేతికందొచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించలేక.. పెట్టుబడులను సైతం పొందలేక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ముగిసే వరకు రైతన్నలకు ప్రకృతి సహకరించడం లేదు. గత నెలలో మొంథా తుఫాన్ వారిని కలవరపెట్టింది. భారీ వర్షాలు పడినా ఈదురుగాలులు లేకపోవడం వల్ల కొంత ఊపిరిపీల్చుకున్నారు. పైగా పంట పక్వానికి వచ్చే సమయం కావడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇప్పుడు సరిగ్గా వరి కోతలు, నూర్పుల సమయం. దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా చిరుజల్లులే కురిసినా.. నష్టం తప్పదేమో నని టెన్షన్ పడుతున్నారు.
ఇదీ పరిస్థితి
మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సుమారు 1,591 ఎకరాల్లో వరి పంట నష్టపో యినట్టు ముందుగా అధికారులు ప్రకటించారు. కానీ ఆ తర్వాత నివేదికలు మారిపోయాయి. సుమారు 261 హెక్టార్లలో మాత్రమే వరి పంట దెబ్బతిన్నట్లు తేల్చారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నిబంధనల ప్రకారం.. 33 శాతం నష్టపోయిన పంట లనే వ్యవసాయాధికారులు గుర్తించారు. దీంతో అనేక మంది రైతులు పరిహారానికి నోచుకోలేదు. ఇదిలా ఉండగా మొంథా వల్ల జిల్లాలో 1,128 మంది రైతులు 8.5 హెక్టార్లలో పత్తి , 21 ఎకరాల్లో మొక్కజొన్నను నష్టపోయారు.
అక్టోబరు మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల 968 మంది రైతులు పంటలను నష్టపోయారు. సుమారు 72 ఎకరాల్లో వరి, 47 ఎకరాల్లో పత్తి , 282 ఎకరాల్లో మొక్కజొన్న, 1000 ఎకరాల్లో అరటి నష్టం వాటిల్లింది. రూ.70 లక్షల నష్టం జరిగినట్టు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లాలో అధికారుల గణాంకాలు ప్రకారం పంట నష్ట నివేదికలు ప్రభుత్వానికి పంపించినప్పటికీ రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో పరిహారం అందడం లేదు.
వరి కోతలు పూర్తయినా..
పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో వరి కోతలు పూర్తయినా.. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. మరోవైపు తుపాన్ల భయంతో రైతులు నష్టానికే ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.