Airport completed on time గడువులోపే విమానాశ్రయం పూర్తి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:28 PM
Airport completed on time భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు గడువులోపే పూర్తి అయ్యేలా జరుగుతున్నాయని రాష్ట్ర ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చ్రర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ముందుగా ట్రంపెట్ వంతెనను పరిశీలించి జాతీయ రహదారి, ఎయిర్‌పోర్టు కనెక్టవిటీపై అధికారులతో చర్చించారు.
గడువులోపే విమానాశ్రయం పూర్తి
రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
భోగాపురం, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు గడువులోపే పూర్తి అయ్యేలా జరుగుతున్నాయని రాష్ట్ర ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చ్రర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డితో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ముందుగా ట్రంపెట్ వంతెనను పరిశీలించి జాతీయ రహదారి, ఎయిర్‌పోర్టు కనెక్టవిటీపై అధికారులతో చర్చించారు. అనంతరం ట్రంపెట్ నుంచి విమానాశ్రయం వరకు వెళ్తూ చుట్టుపక్కల రహదారులను పరిశీలించారు. అప్రోచ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవన నిర్మాణం, విమానాల రన్‌వేను పరిశీలించారు. ఆపై ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, విద్యుత్తుశాఖ సిబ్బందితో చర్చించారు. ఈనెల 30లోగా 33కేవీ విద్యుత్ లైన్లు ఇస్తామని లక్ష్మణరావు వివరించారు. నీటిసరఫరాకు సంబంధించి ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ కవిత, ఇతర అధికారులతో చర్చించారు. మొదటిఫేజ్‌లో రోజుకు 17లక్షల లీటర్ల(1.7ఎంఎల్‌డి)నీరు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 2030వరకు ఈవిధంగా నీటి సరఫరా ఇస్తే సరిపోతుందని, ఫేజ్ 2కి సంబంధించి ఇతర అభివృద్ధి పనులు, హోటళ్లకు కలిపి 3.3 ఎంఎల్‌డి నీరు అవసరం ఉంటుందని చెప్పారు. సముద్రం నుంచి ఉప్పునీటిని సేకరించి మంచినీరుగా తయారుచేసే ప్రక్రియపైనా చర్చించారు. కృష్ణబాబు వెంట జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఆర్డీవో డి.కీర్తి, తహసీల్దార్ రమణమ్మ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సీఈవో కన్వర్ బీర్ సింగ్ కలరా, ప్రాజెక్టు హెడ్ బీహెచ్ రామరాజు, సీడీవో కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.