Again the In-Charges? మళ్లీ ఇన్‌చార్జిలేనా?
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:43 PM
Again the In-Charges? పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారుల నియామకం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తుండడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.
తప్పని పాలనాపరమైన ఇబ్బందులు
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభావం
పార్వతీపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారుల నియామకం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తుండడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లుగా ఉన్న యశ్వంత్ కుమార్‌రెడ్డి, అశుతోష్ శ్రీవాత్సవలు ఇప్పటివరకు ఐటీడీఏలకు ఇన్‌చార్జి పీవోలుగా వ్యవహరించారు. అయితే వారికి ఇటీవల బదిలీలయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో సబ్ కలెక్టర్లుగా నియామకమైన కొత్త ఐఏఎస్‌లు విధుల్లో చేరనున్నారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోలుగా కూడా వారినే కొనసాగించను న్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి పీవోలు లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిపై ఆ ప్రభావం పడుతోంది. మరోవైపు ఐటీడీఏలపై అవగాహన వచ్చే సమ యానికి ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారులను కూడా బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఇలాగైతే ప్రభుత్వ లక్ష్యాలు ఏ విధంగా నెరవేరుతాయని గిరిజన సంఘాలు ప్రశ్ని స్తున్నాయి. ప్రస్తుతం ఐటీడీఏలపై పూర్తి అవగాహన ఉన్న సబ్ కలెక్టర్లనే పూర్తిస్థాయి పీవోలుగా నియమించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.