శిశువు మృత్యువాత
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:18 AM
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని రెల్లివలస పీహెచ్‌సీ వద్ద బాధిత కుటుంబీకులు శుక్రవారం ఆందోళన చేశారు.
రెల్లివలస పీహెచ్‌సీ వద్ద కుటుంబీకుల ఆందోళన
పూసపాటిరేగ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని రెల్లివలస పీహెచ్‌సీ వద్ద బాధిత కుటుంబీకులు శుక్రవారం ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చల్లవానితోట గ్రామానికి చెందిన వి.రాధిక నిండు గర్భిణి. ఆమెకు గురువారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త సన్యాశిరావు వెంటనే రెల్లివలస పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు. అయితే అక్కడి సిబ్బంది ఆమెను రాత్రి ఆసుపత్రిలోనే ఉంచి.. ఉదయం 7గంటలకు ప్రసవం చేసే గదిలోకి తీసుకువెళ్లారు. వైద్యాధికారిణి కాసేపటిలో వస్తారంటూ కాలయాపన చేశారు. వేరే ఆసుపత్రికి తీసుకువెళ్తామంటే తీసుకు వెళ్లనివ్వలేదని సన్యాశిరావు తెలిపారు. క్లిష్ట పరిస్థితిలో 108కి ఫోన్ చేయగా, ఆ సిబ్బంది వచ్చి వారు బిడ్డను తీసేశారు. ఉదయం 9గంటలకు వైద్యాధికారిణి వచ్చారు. అయితే తల్లీ బిడ్డను 108 వాహనంపై విజయనగరం ఘోషాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు అక్కడి ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో మృత శిశువును పట్టుకుని రెల్లివలస పీహెచ్‌సీ వద్ద కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందినట్లు వారు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని, వారికి నచ్చజెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై పీహెచ్‌సీ వైద్యాధికారిణి భాగ్యరేఖ మాట్లాడుతూ శిశువు మెడకు పేగు చుట్టుకు పోవటంతో పాటు మరి కొన్ని కారణాల వల్ల ప్రసవానికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. 108 వాహన సిబ్బంది వచ్చి ప్రసవం చేయకపోతే తల్లికి కూడా ప్రాణాపాయం సంభవించేదని తెలిపారు.