విద్యార్థులకు బోధించి.. కలిసి భోజనం చేసి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:46 PM
గంట్యాడ జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ రామసుందర్ రెడ్డి తనిఖీ చేశారు.
- గంట్యాడ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
- పట్టుదలగా చదవాలని పిల్లలకు సూచన
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గంట్యాడ జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ రామసుందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయన ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారితో కలిసి కూర్చొని భోజనం కూడా చేశారు. ముందుగా పదో తరగతి గదిలోకి వెళ్లి అప్పటికే ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠాలను పరిశీలించారు. తరువాత విద్యార్థులతో మాట్లాడారు. వారికి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మీడియం ఏదైనా ఫర్వాలేదని, పట్టుదలగా చదవాలని సూచించారు. పలు విద్యార్థులు గైర్హాజరు కావడంపై ప్రధానోపాధ్యాయురాలను ప్రశ్నించారు. విద్యార్థులు శతశాతం హాజరయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. వంటశాలకు వెళ్లి మెనూ పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారు చేశారని వంట ఏజెన్సీ సభ్యులను అడిగారు. 350 మందికి 40 కేజీల బియ్యంతో పులిహోరా చేసినట్లు వారు చెప్పారు. వంటపాత్రలో ఉన్న పులిహోరాను కలెక్టర్ పరిశీలించి కనీసం పది కేజీలు కూడా ఉండవని, ఇది సరైనది కాదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కంచం పట్టుకుని విద్యార్థులతో కలిసి క్యూలో నిలబడి భోజనం తెచ్చుకున్నారు. వారితో పాటు కింద కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. పులిహోరాతో పాటు ఉడికిన గుడ్డు, చక్కీ, పచ్చడి విద్యార్థులకు పెట్టారు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని పర్యక్షించాలంటూ డీఈవో మాణిక్యం నాయుడుకి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నీలకంఠేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.