Share News

plans for Kharif: ఖరీఫ్‌కు ముందస్తు ప్రణాళికలు

ABN , Publish Date - May 02 , 2025 | 12:03 AM

plans for Kharif: ఖరీఫ్‌ కోసం రైతులకు ఉపయోగకరంగా ఉండే ముందస్తు వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌ సూచించారు.

 plans for Kharif: ఖరీఫ్‌కు ముందస్తు ప్రణాళికలు
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌

జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌

గరుగుబిల్లి, మే 1 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ కోసం రైతులకు ఉపయోగకరంగా ఉండే ముందస్తు వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్‌ సూచించారు. గురువారం తోటపల్లి జట్టు ట్రస్ట్‌ నూతన కార్యాలయ ప్రాంగణంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పండించగలరన్నారు. రసాయనాలతో ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు భూమికి నష్టం కలుగుతుందన్నారు. రుతు పవనాలకు ముందుగానే 30 రకాల పంటలకు సంబంధించి విత్తనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన నవధాన్యాల కిట్లను రైతుసేవా కేంద్రాల పరిధిలో సిద్ధం చేయాలని తెలిపారు. నవధాన్యాలు సాగు చేసే రైతులు వివరాలను నమోదుతో పాటు విస్తీర్ణంపై ఈక్రాఫ్‌ చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ సంస్థలతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ పి.షణ్ముఖరాజు మాట్లాడుతూ.. రైతులు విధిగా మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. రీజనల్‌ టెక్నికల్‌ అధికారి జి.హేమసుందర్‌ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం చేయని గ్రామాల్లో నవధాన్యాల కిట్లను సిద్ధం చేయాలన్నారు. 365 రోజులు భూమిపై పంటలు పండించడంతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి ఆర్‌.విజయభారతి, సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.ప్రహరాజ్‌, రైతు సాధికార సంస్థ ప్రతినిధి బి.భాను, రాజారావు, ఎన్‌ఎఫ్‌ఏలు, ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:03 AM