Share News

Admissions ప్రవేశాలు ఉన్నట్టా.. లేనట్టా!

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:09 PM

Admissions: There Yet Not There! ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లోని ప్లస్‌-2 హైస్కూళ్లలో ఇంటర్‌ విద్య నిర్వహణకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఆయా బడుల్లో ఇంటర్‌లో చేరుదామనుకునే వారికి నిరాశే ఎదురవుతుంది.

Admissions  ప్రవేశాలు ఉన్నట్టా.. లేనట్టా!
గరుగుబిల్లిలో ప్లస్‌-2 జడ్పీ ఉన్నత పాఠశాల

  • మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆదేశాలు రాని వైనం

  • విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పని తిప్పలు

గరుగుబిల్లి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లోని ప్లస్‌-2 హైస్కూళ్లలో ఇంటర్‌ విద్య నిర్వహణకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఆయా బడుల్లో ఇంటర్‌లో చేరుదామనుకునే వారికి నిరాశే ఎదురవుతుంది. ఈ ఏడాది టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు సుదూర ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో జాయిన్‌ కాలేక.. ఇంటర్‌ విద్యను ఎలా చదవాలో తెలియక తీవ్ర మథనపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్చారు. ఇంటర్‌ విద్యకు అనుమతులు ఇచ్చినా.. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. కనీసం అధ్యాపకులను సైతం నియమించలేదు. ల్యాబ్‌ సదుపాయం వంటివి ఊసే ఎత్తలేదు. దీంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో పాఠశాల ఉపాధ్యాయులే ఇంటర్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు.

- ప్రస్తుతం హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ బోధనపై ఉన్నతాధికారులు ఇంకా ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు. దీంతో ఆయాచోట్ల ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోవైపు లోపాయికారిగా సిబ్బంది ఇక్కడ జాయినింగ్స్‌ లేవని చెబుతున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వారికే మాత్రమే బోధిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఇంతవరకు పాఠ్య పుస్తకాలు అందలేదు. దీంతో సంబంధిత అధ్యాపకులు సెల్‌ఫోన్‌లో చూసి పాఠాలు బోఽధిస్తున్నారు.

- ఈ ఏడాది టెన్త్‌ పాసైన దివ్యాంగ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానికంగా ప్లస్‌2 హైస్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలు లేకపోవడంతో ఎక్కడికివెళ్లి చదువుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నారు.

- సీతంపేటలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పాలకొండ బాలికల కళాశాలలో ప్రవేశాలు కల్పించారు.

- గరుగుబిల్లిలో ఈ ఏడాది టెన్త్‌లో సుమారు 80 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అంతరాయం కలిగింది. మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాలల్లో మొదటి సంవత్సరంలో చేరుతామన్నా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను వివరించారు. దీనిపై సంబంధిత హెచ్‌ఎం తేజేశ్వరిని వివరణ కోరగా.. ‘ గతంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసినా వారికే ప్రస్తుతం రెండో సంవత్సరం బోధన అందిస్తున్నాం. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం రెండో సంవత్సరానికి సంబంధించి 17 మంది ఉన్నా అంతంత మాత్రంగానే సౌకర్యాలు ఉన్నాయి. వీరికి అవసరమైన పుస్తక సామగ్రి అందలేదు. ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించలేదు. ఈ సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించాం.’ అని తెలిపారు.

అనుమతులు లేవు

జడ్పీ ఉన్నత పాఠశాలల్లో గతంలో ఏర్పాటు చేసిన జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎటువంటి అనుమతులు రాలేదు.గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లోని ప్లస్‌-2 హైస్కూళ్లలో ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వారికే బోధన కొనసాగిస్తున్నాం. ప్రథమ సంవత్సరంలో చేరికల అంశాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాం.

- బి.రాజ్‌కుమార్‌, డీఈవో

===============================

సమాచారం లేదు..

గరుగుబిల్లిలోని ప్లస్‌-2 హైస్కూల్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఈ సమస్య డీఈవో పరిధిలోనే ఉంది. సీతంపేటలో ఇంటర్‌ మొదటి సంవత్సరం వారిని పాలకొండ కళాశాలలో చేర్పించాం.

- వై.నాగేశ్వరరావు, జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి

Updated Date - Jun 28 , 2025 | 11:09 PM