Share News

Admissions అడ్మిషన్లు ప్రారంభించాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:08 PM

Admissions Should Begin ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులతో సమీక్షించారు.

Admissions   అడ్మిషన్లు ప్రారంభించాలి
కరపత్రాలను విడుదల చేస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారులను విధిగా ఒకటో తరగతిలో చేర్చాలన్నారు. బడి బయట ఉన్న చిన్నారులను సైతం గుర్తించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈనెల 19న వీడ్కోలు కార్యక్రమం జరుగుతుందని, 21న వారంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలని తెలిపారు. గత ఏడాది ఒకటో తరగతిలో 10,932 మంది చేరారని, ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో విద్యార్థులు చేరాలని ఆదేశించారు. ఏడో తరగతి నుంచి 8వ తరగతి, టెన్త్‌ నుంచి ఇంటర్మీడియట్‌ లేదా ఇతర కోర్సుల్లో చేరే విద్యార్థులపైనా దృష్టిసారించాలని సూచించారు. 12,270 మంది 7వ తరగతి చదువుతున్నారని, జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్‌లో 9,200 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల వయసుకు తగ్గట్టుగా బరువు, ఎదుగుదల ఉండాలని, అలా లేనిపక్షంలో సూపర్‌ వైజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పౌష్టికాహారం తీసుకుంటున్నప్పటికీ సరైన వృద్ధి లేనప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. నిర్దేశిత ప్రమాణాలకు తగిన విధంగా గుమ్మలక్ష్మీపురం, సీతంపేట తదితర ప్రాంతాల్లో చిన్నారుల బరువు, ఎదుగుదల కనిపించడం లేదన్నారు. దీనిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. శిశువు జన్మించిన రెండు నెలల్లో జనన ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ నిర్వహణ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీవో టి.కనకదుర్గ, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారి డి.మంజులవీణ, గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి ఎన్‌.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:08 PM