address is not found! అడ్రస్ దొరకట్లే!
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:14 AM
address is not found! విజయనగరం జిల్లా కేంద్రానికి వివిధ పనులపై వచ్చేవారిలో ఎక్కువ మంది అడ్రస్ పట్టుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఊరు నుంచి నగరానికి చేరడానికి గంట ప్రయాణం కాగా నగరంలో అడ్రస్‌ను గుర్తించడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటున్నారు.
అడ్రస్ దొరకట్లే!
కాలనీలు, వీధులు, కూడళ్లు, కార్యాలయాలకు కానరాని నేమ్‌బోర్డులు
అడ్రస్ వెతుక్కోవడానికే గంటల వ్యవధి
అవస్థలు పడుతున్న ప్రజలు
సమయం వృథా అవుతోందని ఆవేదన
పట్టించుకోని ప్రణాళిక విభాగం అధికారులు
- విజయనగరంలోని ఎంప్లాయిస్ కాలనీలో గృహప్రవేశం కోసం గజపతినగరం నుంచి బయలుదేరిన ఓ వ్యక్తి నగరానికి గంటలో చేరాడు. ఇంటి అడ్రస్‌ను పట్టుకోవడానికి మాత్రం రెండు గంటలు తీసుకున్నాడు. కాలనీకి నేమ్‌బోర్డు లేదు. ఎవరిని అడిగినా తెలియదనే సమాధానం రావడంతో గమ్యం చేరడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది.
- మెంటాడకు చెందిన తాడ్డి అరుణ్‌కుమార్ జిల్లా కేంద్రంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. నగరంలోని కొంతమంది మిత్రులతో కలిసి కస్పా పాఠశాల సందులో రూం తీసుకున్నాడు. కుమారుడి కోసం గ్రామం నుంచి బియ్యం పట్టుకుని నగరానికి వచ్చిన అరుణ్‌కుమార్ తండ్రి చిరునామా గుర్తించడానికి మూడు గంటలు తిరిగాడు. కస్పా పాఠశాల సందు పేరుతో నేమ్‌బోర్డు లేకపోవడమే ఈ దుస్థితికి కారణం.
- ప్రమాదానికి గురైన స్నేహితుడు నగరంలోని ధర్మపురి కూడలి వద్ద ఉన్న ఆసుపత్రిలో చేర్చారని తెలుసుకుని వచ్చిన గజపతినగరం మండలం డోలపాలెం గ్రామంకు చెందిన దొంతల బంగారునాయుడుకు ఆసుపత్రి ఎక్కడ ఉందో తెలుసుకునే వెళ్లి పరామర్శించేసరికి రెండు గంటలు పట్టింది.
విజయనగరం టౌన్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లా కేంద్రానికి వివిధ పనులపై వచ్చేవారిలో ఎక్కువ మంది అడ్రస్ పట్టుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఊరు నుంచి నగరానికి చేరడానికి గంట ప్రయాణం కాగా నగరంలో అడ్రస్‌ను గుర్తించడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటున్నారు. తాము వెళ్లవలసిన కాలనీ లేదా వీధికి ఎలా వెళ్లాలో తెలియక, ఆ వీధులు ఎక్కడున్నాయో గుర్తించలేక నానా అవస్థలకు గురవుతన్నారు. నగరంలో ఆయా ప్రాంతాలను తెలిపే బోర్డులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల కొత్తవారు చాలా ప్రయాస పడుతున్నారు. నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో 60 సచివాలయాల పరిధిలో నేమ్‌బోర్డుల ఏర్పాటు జరగలేదు. ఎప్పుడో పదేళ్లక్రితం బోర్డులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థ ఆవిర్భావం తరువాత ఒక్కబోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో నగరానికి కొత్తగా వచ్చే సందర్శకులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ ఆలయాల దర్శనానికి వచ్చేవారికి మరీ ఇబ్బంది ఎదురవుతోంది. అడ్రస్ కోసం ఎంతోమందిని అడగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన కూడళ్లలో కూడా నేమ్‌బోర్డులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
- వాణిజ్య పరంగా జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి చెందుతోంది. నగరంలో ప్రస్తుతం సుమారు 40వరకూ కాలనీలున్నాయి. వీటిల్లో సుమారు రెండులక్షలకు పైగా జనాభా జీవనం సాగిస్తున్నారు. జిల్లా నలుమూలలనుంచి వచ్చిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిత్యం అనేకమంది వైద్యం, ఆలయాల దర్శనం, విద్య తదితర పనులపై వస్తున్నారు. బస్టాండ్,రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికులు కాలనీల చిరునామాలకోసం చాలా ప్రయాస పడుతున్నారు. శివారు కాలనీలకు చేరుకోవాలంటే చాలా కష్టమౌతోంది.
నేమ్‌బోర్డులు ఉండాలి
కార్పొరేషన్‌గా మారి ఐదేళ్లుపైనే అవుతోంది. నగరం కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ఎంతోమంది ప్రతీరోజు నగరానికి వచ్చిపోతుంటారు. కొత్తవాళ్లకు ఆయా ప్రాంతాల పేర్లు తెలియక ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. కార్పొరేషన్ అధికారులు తక్షణమే నేమ్‌బోర్డులు ఏర్పాటు చేస్తే మంచిది.
- మైలపల్లి.పైడిరాజు, మాజీ కౌన్సిలర్, 47వ డివిజన్
నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తాం
నగరంలో ప్రతి ఇంటికీ త్వరలో డిజిటల్ డోర్‌నెంబర్లు వస్తున్నాయి. వాటిని ఏర్పాటుచేసిన తరువాత వీధుల్లో నేమ్‌బోర్డులు ఏర్పాటుచేస్తాం. కొద్దిగా సమయం పడుతుంది.
- పి.నల్లనయ్య, కమిషనర్, విజయనగరం