అదనపు భారం
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:41 AM
గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి పథకాలపై అదనపు భారం పడింది.
- పట్టణాల్లో తాగునీటి పథకాలకు పెరిగిన వ్యయం
- గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
- పనులు పూర్తిచేయనున్న కూటమి ప్రభుత్వం
నెల్లిమర్ల, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి పథకాలపై అదనపు భారం పడింది. ఇప్పుడు ఈ పనులు పూర్తి చేసేందుకు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా తాగునీటి పథకాలను నిర్మించాలని భావిస్తోంది. కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా డీపీఆర్‌లు రూపొందించి టెండర్లు ఖరారు చేసే పనిలో పడింది. త్వరలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో తాగునీటి ప్రాజెక్టులు, పథకాల పనులు మొదలుకానున్నాయి.
కేటాయింపులు ఇలా..
జిల్లాలో ప్రస్తుతం ఉన్న మంచినీటి పథకాలతో పాటు అదనపు సామర్థ్యంతో తాగునీరు అందించేందుకు భారీగా నిధులు మంజూరయ్యాయి. నెల్లిమర్ల నగర పంచాయతీలో 6 ఎంఎల్‌డీల నీరు అందించేందుకు రూ.46 కోట్లు, విజయనగరం నగరపాలక సంస్థలో 7 ఎంఎల్‌డీలకు రూ.66.36కోట్లు, బొబ్బిలిలో 17 ఎంఎల్‌డీలకు రూ.126.39 కోట్లు, రాజాంలో 3 ఎంఎల్‌డీలకు రూ.9.82 కోట్లు, పార్వతీపురంలో 15 ఎంఎల్‌డీలకు రూ.86.54 కోట్లు, సాలూరులో 10 ఎంఎల్‌డీలకు రూ.100.36 కోట్లు, పాలకొండలో 7 ఎంఎల్‌డీలు అందించేందుకు రూ.71.94 కోట్లు కేటాయించారు.
అన్ని పథకాలకూ పెరిగిన వ్యయం..
వైసీపీ ప్రభుత్వంలో పట్టణాల్లో తాగునీటికి సంబంధించి నిర్లక్ష్యం కొనసాగింది. అప్పట్లో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నిధులతో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని సాలూరు, పాలకొండ, నెల్లిమర్ల పట్టణాల్లో రూ.171 కోట్లతో 13 ఎంఎల్‌డీల సామర్థ్యంతో పథకాల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. సాలూరు మునిసిపాలిటీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కానీ, పనులు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు అవే పనులకు రూ.218.19 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. అంటే అదనంగా రూ.47 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.
-బొబ్బిలి, పార్వతీపురం మునిసిపాలిటీల్లో 32 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నీటిని అందించేందుకు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (యూఐడీఎఫ్) నుంచి రూ.180 కోట్లు కేటాయించారు. గతంలో టెండర్లు పూర్తయ్యాయి. కానీ, కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేయకపోవడంతో బిల్లులు నిలిచిపోయాయి. ఇప్పుడు అవే పనులకు రూ.212.93 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అంటే పెరిగిన అదనపు వ్యయం రూ.32 కోట్లు.
- విజయనగరం నగరపాలక సంస్థతో పాటు రాజాం మునిసిపాలిటీలో తాగునీరు అందించేందుకు గాను అమృత్ పథకం మంజూరు చేశారు. ఆ తరువాత ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ పరిధిలోకి మార్చారు. గతంలో ఈ రెండింటికీ రూ.60 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. కానీ ఇప్పుడు రూ.76.18 కోట్లకు అంచనా వ్యయం చేరుకుంది. అంటే రూ.16 కోట్ల భారం పెరిగింది.