Share News

చెడు వ్యసనాలకు బానిసై

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:25 AM

చెడు వ్యసనాలకు బానిసై ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. గురువారం వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 చెడు వ్యసనాలకు బానిసై
వివరాలు వెల్లడిస్తున్న సీఐ అప్పలనాయుడు

- బంగారమ్మపేటలో దొంగతనం

- ముగ్గురు నిందితుల అరెస్టు

-రూ.32వేల నగదు, 6.5 గ్రాముల బంగారం స్వాధీనం

సాలూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. గురువారం వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.32వేల నగదు, 6.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ అప్పలనాయుడు వివరాల మేరకు.. పట్టణంలో బంగారమ్మ పేటలో నివాసం ఉంటున్న దేవుపల్లి వెంకటరావు ఈ నెల 7న పెందుర్తిలో ఉన్న తన కూతురి ఇంటికి భార్య లక్ష్మితో కలిసి వెళ్లాడు. 9వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఆయన పక్కింటిలో నివాసముంటున్న బూరాడ శేఖర్‌.. వెంకటరావుకు ఫోన్‌ చేసి ‘మీ ఇంటిలో దొంగలుపడ్డారు’ అని చెప్పాడు. దీంతో ఇంటికి చేరుకున్న వెంకటరావు బీరువాను తనిఖీ చేయగా అందులో 7 గ్రాముల బంగారు నగలు, రూ.37వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం సాలూరు పట్టణం నుంచి జీగిరాంవైపు స్కూటీపై వెళ్తున్న బంగారమ్మకాలనీకి చెందిన బొత్స నవీన్‌, కోడూరు కార్తీక్‌, మాడుగల వంశీ కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు అలవాట్లకు బానిసగా మారి దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో బంగారమ్మపేటలో తాళం వేసి ఉన్న వెంకటరావు ఇంటికి వెళ్లి స్ర్కూ డ్రైవర్‌, జాకీరాడ్డు సహాయంతో తాళాలు, బీరువాను పగలగొట్టి చోరీ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.32 వేల నగదు, 6.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ అనీల్‌, పోలీసు సిబ్బంది అప్పన్న, చంద్రశేఖర్‌ను సీఐ అభినందించారు.

Updated Date - Nov 14 , 2025 | 12:25 AM