వ్యసనాలకు బానిసై..
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:28 AM
ఆయన ఓ ప్రభుత్వ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. ఆదాయం అంతంత మాత్రమే.
- చోరీకి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి
- మరో ఇద్దరితో కలిసి దొంగతనం
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- 16 తులాల బంగారు నగల స్వాధీనం
రాజాం రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆయన ఓ ప్రభుత్వ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. ఆదాయం అంతంత మాత్రమే. చెడు వ్యసనాలు, బెట్టింగ్‌ల జోరు. దీంతో చోరీలు చేయాలని అనుకున్నాడు. గతంలో పరిచయమున్న ఓ వ్యక్తితో పాటు నేరచరిత్ర ఉన్న మరో వ్యక్తికి తన ప్లాన్ చెప్పాడు. వీరితో కలిసి తన స్వగ్రామంలోనే ఓ ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, ఇత్తడి వస్తువులను ఎత్తుకెళ్లాడు. కొద్దిరోజుల వ్యవధిలోనే వీరంతా పోలీసులకు దొరికిపోయారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, రాజాం టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ అందించిన వివరాల మేరకు.. వంగర మండలం బాగెంపేటకు చెందిన రెడ్డి గోపాలకృష్ణం నాయుడు అదే మండలం ఎం.సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా ఔట్‌సోర్సింగ్ కింద చేస్తున్నాడు. వ్యసనాల బారిన పడిన గోపాలకృష్ణ తన గ్రామంలో ఆర్థికంగా స్థితిమంతుడైన పశుమర్తి శంకరరావు ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పాలకొండ మండలం యరకారాయపురం గ్రామానికి చెందిన శ్రీరామ బాలరాజు, ఇదే మండలం టి.కె.రాజపురం గ్రామానికి చెందిన జాడ దుర్గారావుల సాయం కోరాడు. శంకరరావు కుటుంబం హైదరాబాద్ వెళ్లడంతో, అదే అదునుగా గత నెల 25న శంకరరావు ఇంట్లో 18 తులాల బంగారు ఆభరణాలు, ఇత్తడి వస్తువులను చోరీ చేశారు. వీటిని ముగ్గురూ పంచుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన శంకరరావు తన ఇంట్లో దొంగతనం జరిగిందని, నెక్‌లెస్, బ్రాసెల్‌ట్, హారం, నల్లపూసలు, ఉంగరం, రెండు జతల చెవిదుద్దులు, నాలుగు ఇత్తడిప్లేట్లు అపహరణకు గురయ్యాయని వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రేగిడి మండలం బూరాడ జంక్షన్ వద్ద నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వారి నుంచి 16 తులాల బంగారం, ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు తులాల బంగారాన్ని శ్రీరామబాలరాజు పార్వతీపురంలో కుదువ పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. బాలరాజుపై గతంలో పలు కేసులు ఉన్నాయని చెప్పారు.
తెరవెనుక ఇదీ జరిగింది
బాగెంపేట చోరీ కేసు విషయంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టిలో పడేందుకు హంగామా చేశారని తెలిసింది. చోరీ జరిగిన తర్వాత నిందితుల మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. వారే నేరుగా బాధితుడు శంకరరావుకు ఫోన్ చేశారు. చోరీ చేసిన బంగారాన్ని మీ ఇంటి ముందున్న స్కూటీలో పెట్టామని, తీసుకోవాలని, పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని శంకరరావు వంగర ఎస్‌ఐ షేక్ శంకర్‌కు చెప్పారు. దీంతో ఎస్‌ఐ ఘటనాస్థలానికి చేరుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. ఇదే సమయంలో శంకరరావు సెల్‌కు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ముగ్గురు నిందితుల్ని బూరాడ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే, తామే దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నామని, వారి నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశామని రాజాంలో శుక్రవారం పెట్టిన ప్రెస్‌మీట్‌లో డీఎస్పీ, రాజాం టౌన్ సీఐ అశోక్‌కుమార్, వంగర ఎస్‌ఐ షేక్ శంకర్ చెప్పడం విశేషం.