పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:50 PM
జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తెలిపారు.
ఇక్కడ దుకాణాల ఏర్పాటుకు రుణాలు అందిస్తాం
డీఆర్‌డీఏ పీడీ సుధారాణి
సాలూరు రూరల్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తెలిపారు. పర్యాటక ప్రాంతాల వద్ద వివిధ దుకాణాల ఏర్పాటుకు మహిళా సంఘ సభ్యులు ముందుకొస్తే బ్యాంకుల ద్వారా వారికి రుణాలు అందిస్తామని అన్నారు. సాలూరు మండలంలోని దళాయివలస రాందారి, శిఖపరువు గోముఖీ జలపాతాలను గురువారం ఆమె పరిశీలించారు. దళాయివలస జలపాతానికి ఆమె కొండల్లో నడిచి వెళ్లారు. మార్గమంతా తుప్పలు, పొదలతో నిండి ఉండడం గమనించారు. అనంతరం దళాయివలస గిరిజనులతో మాట్లాడారు. జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి గ్రామస్తులు సహకరించాలన్నారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. తొలుత పర్యాటక ప్రాంతానికి వెళ్లే మార్గంలో తుప్పలు,పొదలను తొలగించాలని కోరారు. జలపాతం సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేస్తు రుణాలు అందిస్తామన్నారు. ఇందుకు నలుగురు మహిళలు ముందుకొచ్చారు. వారికి రుణాలు అందించడానికి చర్యలు తీసుకోవాలని వెలుగు ఏపీఎం ఎ.జయమ్మను ఆదేశించారు. అలాగే దళాయివలస నుంచి జలపాతానికి బైక్‌లపై పర్యాటకులను తరలించి చార్జి తీసుకోవడానికి ఎవరైన సిద్ధం కావాలన్నారు. ఇందుకు ఐదుగురు అంగీకారం తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం జయమ్మ, సీసీలు లక్ష్మణరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.