కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక
ABN , Publish Date - May 22 , 2025 | 11:43 PM
‘తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక.’ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
- పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
- కష్టపడిన వారికి అండగా ఉంటాం
- జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
- మంత్రి సంధ్యారాణి
- సందడిగా మినీ మహానాడు
పార్వతీపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక.’ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. జిల్లా కేం ద్రం పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధ్యక్షతన అరకు పార్లమెంట్ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం గురువారం సందడిగా జరిగింది. తొలుత మంత్రి సంధ్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అని, భూమి.. ఆకాశం ఉన్నంత వరకూ పార్టీకి తిరుగు లేదని అన్నారు. ‘ కడప జిల్లా టీడీపీ అడ్డాగా మారింది. దీంతో సైకో జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కడపలో ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. వచ్చే స్థానిక ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కూడా టీడీపీయే విజయం సాధించేలా కృషి చేయాలి. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయి. వెన్నుపోటు పొడిచిన వారిని దూరంగా ఉంచుతాం. కష్టపడిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం. మంత్రి లోకేశ్ రెడ్‌బుక్‌తో వైసీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నాతో పాటు ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడు హర్షవర్థన్, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ శ్రావణ్, మాజీ ఎమ్మెల్యేలు ఆర్పీ బంజ్‌దేవ్, జి.ఈశ్వరి, పాలకొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌దేవ్, నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
- ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. ‘నేను ఎంపీటీసీ స్థాయి నుంచి ప్రభుత్వ విప్ వరకు ఎదిగానంటే సీఎం చంద్రబాబే కారణం. కురుపాం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా.’అని తెలిపారు.
- ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. ‘నా ప్రాణం ఉన్నంత కాలం టీడీపీ కోసం పనిచేస్తా. గత 30 ఏళ్లు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. పార్టీ కార్యకర్తలను గానీ, నాయకులను గాని టచ్ చేయాలంటే నన్ను ముందు టచ్ చేయాలి. పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం’అని పేర్కొన్నారు.
- రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. ‘నేను ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. నన్ను శాసనసభలో కూర్చొనే అవకాశం కల్పించిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.’అని తెలిపారు.