విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:02 AM
సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రామసుందర్ రెడ్డి హెచ్చరించారు.
- వార్డెన్లు మరింత బాధ్యతగా పని చేయాలి
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రామసుందర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ‘విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. వారికి కెరీర్ కౌన్సెలింగ్ నిర్వహించి మంచి భవిష్యత్‌కు బాటాలు వేయాలి. వారి ఆరోగ్య తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి. హాస్టళ్లలో వసతులను మెరుగుపర్చాలి. నిఽధుల కోసం ప్రతిపాదనలు పంపించాలి. దాతలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో ఆర్‌వో ప్లాంట్‌లు సమకూర్చాలి. మరుగుదొడ్లు లేకపోతే స్వచ్ఛభారత్ మిషన్‌కి ప్రతిపాదనలు పంపించాలి. సరుకులను వృథా చేయవద్దు. ఏ నెలకు ఎంత సరుకులు అవసరమైతే అంతే తీసుకోవాలి. మెనూ కచ్చితంగా అమలు చేయాలి. దీనిపై రాజీ పడకూడదు. సంక్షేమ అధికారులు మరింత బాధ్యతగా పని చేయాలి. శిశు గృహ, బాల సదన్, చిన్న పిల్లలు వసతి గృహాలపై మరింత శ్రద్ధ చూపించాలి. సంక్షేమ వసతి గృహాలు, చిల్డ్రన్ హోమ్స్, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తాం.’ అని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో బాలల సంరక్షణ కమిటీ జిల్లా చైర్‌పర్సన్ హిమబిందు, డీఆర్వో శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమాధికారి జ్యోతిశ్రీ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ ఆవయ్య, డీఈవో మాణిక్యం నాయుడు, ఎస్‌ఎస్‌ఏ పీవో రామారావు తదితరులు పాల్గొన్నారు.
బాలల సంరక్షణ కేంద్రాలకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తన చాంబర్‌లో శుక్రవారం ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు. జిల్లాలో మూడు బాల సదన్‌లు, ఒక చిల్డ్రన్ హోమ్, ఒక శిశు హోమ్, నాలుగు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్లకు సర్టిఫికెట్లను అందజేశారు.