వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:23 AM
: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
- జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
గరుగుబిల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం గురుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించి తగిన గుర్తింపు పొందాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కారణంగా పలు వ్యాధులు ఆశిస్తున్నాయన్నారు. సచివాలయాల పరిధిలోని సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి జ్వర బాధితులు ఉన్నట్లయితే రక్త పరీక్షలు నిర్వహించి తగిన సేవలందించాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోజువారీ ఎంతమందికి తనిఖీలు నిర్వహిస్తున్నారని ల్యాబ్ టెక్నీషియన్ పి.శ్రీనివాసరావును అడిగారు. ప్రతిరోజూ 200 మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని టెక్నీషియన్ చెప్పారు. అత్యవసర మందులు నిల్వలతో పాటు ఓపీ రికార్డులను జేసీ పరిశీలించారు. గతంలో కంటే ప్రస్తుతం ఓపీ సంఖ్య పెరగడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమయపాలనతో పాటు రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో వసతులను నిశితంగా పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు కేంద్రం ఆవరణలో రోగులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీ వో జి.పైడితల్లి, డాక్టర్ ఎన్‌ఎంకే తిరుమలప్రసాద్, కంటి వైద్య నిపుణులు శ్రీనివాసరావు, సిబ్బంది జగదీశ్వరి, తదితరులు ఉన్నారు.
పారదర్శకంగా ధాన్యం కొనుగోలు..
జిల్లాలో ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని నాగూరు రైతుసేవా కేంద్రంతో పాటు ధాన్యం సేకరణ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, రైతులకు అందుతున్న సేవలు, తూనిక యంత్రాల పనితీరు, ధాన్యం నాణ్యతా పరీక్షల ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.