Best Results ఉత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:16 PM
Achieve the Best Results రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు అన్నారు. శుక్రవారం భామినిలో ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన సులభతరహా విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు.
భామిని, సీతంపేటలో పర్యటన
విద్యా ప్రమాణాలపై ఆరా
విద్యార్థులతో ముఖాముఖి
భామిని, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు అన్నారు. శుక్రవారం భామినిలో ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన సులభతరహా విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. గత ఏడాది టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రిన్సిపాల్ బాబూరావును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ల్యాబ్‌లు, ఆట పరికరాలు, తరగతి గదులు, నైపుణ్య శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. విద్యాబోధన, సిలబస్‌పై విద్యార్థులతో ముచ్చటించారు. హిందీ పాఠాలు, సిలబస్‌లో మార్పులు, చేర్పులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రైమరీ పాఠశాలలో బీఎఫ్‌ఎల్‌ఎన్ సర్వేపై ఆరా తీస్తూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.
మెగా పీటీఎంకు ఏర్పాట్లు
వచ్చే నెల 5న భామినిలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌కు సీఎం చంద్రబాబు లేదా మంత్రి లోకేష్ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు ఏర్పాట్లుతో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మోడల్‌స్కూల్ పరిసరాలను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పరిశీలించారు. శుక్రవారం విద్యాశాఖ కమిషనర్‌తో కలిసి మరోసారి సందర్శించారు. ఈ పరిశీలనలో డీఈవో రాజ్‌కుమార్, ఏపీసీ తేజేశ్వరరావు, ఏపీవో చిన్నబాబు తదితరులు ఉన్నారు.
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
సీతంపేట రూరల్: గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు అన్నారు. శుక్రవారం సీతంపేట గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించారు.పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకొని చక్కగా చదువుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకో వాలన్నారు. ప్రతిఒక్కరూ టెన్త్‌లో ఉత్తీర్ణులవ్వాలన్నారు. పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు న్నాయా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమ బాలుర పాఠశాల క్రీడా మైదానాన్ని పరిశీలించారు.