achieve constable job నిరీక్షణ ఫలించింది!
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:15 AM
achieve constable job మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు నియామకపత్రాలు అందుకున్నారు. అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 560 మంది నియామకపత్రాలను అందుకున్నారు.
నిరీక్షణ ఫలించింది!
అమరావతిలో నియామకపత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లు
అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం
ఈ నెల 22 నుంచి శిక్షణ
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్ శాఖ
విజయనగరం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి)
మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు నియామకపత్రాలు అందుకున్నారు. అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 560 మంది నియామకపత్రాలను అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీస్ శాఖ కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఎట్టకేలకు నియామకపత్రాలు అందించింది. ఈ నెల 22 నుంచి వీరికి శిక్షణ ప్రారంభంకానుంది. రెండు దశల్లో తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుంది. మొదటి దశ శిక్షణ తరువాత వారం రోజుల పాటు సెలవులు ఇస్తారు. మళ్లీ రెండో దశ శిక్షణ ప్రారంభిస్తారు. ఈ శిక్షణ తరువాత వారందరికీ పోస్టింగులు ఇస్తారు.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ జాప్యం పాపం వైసీపీదే. ఏటా జాబ్ కాలెండర్ అంటూ 2019 ఎన్నికల్లో ఆర్భాటం చేశారు. కానీ జాబ్ కాలెండర్ ఒకసారి కూడా విడుదల చేయలేకపోయారు. 2022 నవంబరులో రాష్ట్ర వ్యాప్తంగా 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఉమ్మడి జిల్లాకు 560 పోస్టులు కేటాయించారు. అయితే ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం తరువాత చేతులెత్తేసింది. అభ్యర్థులు విన్నపాలు చేసినా కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంది. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి రావడంతో కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన న్యాయ చిక్కుముడులను పరిష్కరించి ఈవెంట్స్‌తో పాటు తుది రాత పరీక్ష నిర్వహించింది. ఫలితాలు ప్రకటించి తాజాగా నియామకపత్రాలను అందించింది.
ప్రత్యేక వాహనాల్లో తరలింపు..
జిల్లా అభ్యర్థులు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతులమీదుగా నియామకపత్రాలు అందుకునేలా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం ప్రత్యేక వాహనాల్లో తరలించింది. జిల్లాల వారీగా అక్కడ ఏర్పాట్లు చేశారు. వసతితో పాటు భోజన సదుపాయం కల్పించారు. మంగళవారం సాయంత్రం నియామకపత్రాలు అందించారు. అనంతరం మళ్లీ జిల్లాల వారీగా ప్రత్యేక వాహనాల్లో సొంత ప్రాంతాలకు బయలుదేరారు. ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభంకానుంది. అదే రోజు వారంతా శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. పోలీస్ విధులకు సంబంధించి అన్నిరకాల శిక్షణను ఇవ్వనున్నారు. అందులో శారీరక దారుఢ్యం, ఆయుధాల వాడకం, చట్టాలపై అవగాహన, ప్రజలతో వ్యవహరించే తీరు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ ఉంటుంది.
--------------------