పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:33 AM
పూసపాటిరేగ పోలీసు స్టేషన్‌లో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పెద్దపతివాడ గ్రామానికి చెందిన మైనపు హారీష్‌కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.
విజయనగరం క్రైం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ పోలీసు స్టేషన్‌లో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పెద్దపతివాడ గ్రామానికి చెందిన మైనపు హారీష్‌కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలని తీర్పు ఇచ్చారన్నారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. పెదపతివాడ గ్రామానికి చెందిన మైనపు హారీస్ 2023 జూలై 4న ఓ బాలికను స్కూల్‌కి వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేశాడు. దగ్గరలో ఉన్న కొబ్బరితోటలోకి తీసుకువెళ్లి బలత్కారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై జూలై 5న పూసపాటిరేగ పోలీసుస్టేషన్‌లో పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు అయింది. అప్పటి డీఎస్పీ గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడు హారీష్‌పై నేరారోపణ రుజువు కావడంతో శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో క్రీయాశీలకంగా వ్యవహారించిన మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ గోవిందరావు, హెచ్‌సీ రామకృష్ణ, పూసపాటిరేగ కోర్టు హెచ్‌సీ ఎస్.రామనివాస్, స్పెషల్ పీపీ ఖజానారావును అభినందించారు.