Share News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:11 AM

జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన కేసులో నగరంలోని హుకుంపేటకు చెందిన పెంకి వివేక్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

విజయనగరం క్రైం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన కేసులో నగరంలోని హుకుంపేటకు చెందిన పెంకి వివేక్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హుకుంపేటకు చెందిన వివేక్‌కు బాలిక, ఆమె తల్లిదండ్రులు ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లే సమయంలో పరిచయమయ్యారు. బాలిక ఆరోగ్యం తరచుగా బాగాలేకపోవడంతో వివేక్‌ వారి ఇంటికి వెళ్లి సాయం చేసేవాడు. బాలికను ఒంటరిగా ఉంచితే ఆరోగ్యం కుదుట పడవచ్చని తల్లిదండ్రులను ఒప్పించాడు. పథకం ప్రకారం అంబటివలసలో ఒక ఇల్లు తీసి.. బాలిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నట్టుగా వివేక్‌ నమ్మించాడు. బాలికతో సన్నిహితంగా ఉంటూ.. వీడియోలు, ఫొటోలు తీసి భయపెట్టాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ పద్మావతి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. అప్పటి డీఎస్పీ విశ్వనాథ్‌ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు వివేక్‌పై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయాధికారి నాగమణి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు. బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరుచేస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారని తెలిపారు. ఏడాదిన్నర వ్యవధిలో నిందితుడికి శిక్ష పడే విధంగా చొరవ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

Updated Date - Aug 30 , 2025 | 12:11 AM