accidents on sebarimalie way ముక్తిమార్గంలో ఆపదల ముళ్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:49 PM
accidents on sebarimalie way శబరిమలై యాత్ర కొందరికి విషాదంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు అనుకోని ప్రమాదంలో చనిపోయారు. ఆ ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు భక్తులు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు.
ముక్తిమార్గంలో ఆపదల ముళ్లు
ఏటా ప్రమాదాల బారిన అయ్యప్ప భక్తులు
శబరిమలైకు నేరుగా దక్కని రైలు ప్రయాణం
సర్వీసులన్నీ విశాఖ నుంచే
ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న భక్తులు
ప్రమాదం మాటున 1400 కిలోమీటర్ల ప్రయాణం
రాజాం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): శబరిమలై యాత్ర కొందరికి విషాదంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు అనుకోని ప్రమాదంలో చనిపోయారు. ఆ ఘటన మరువక ముందే విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు భక్తులు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. ఏటా ప్రతి జిల్లా నుంచి వెళుతున్న భక్తులు ఇదే మాదిరిగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 30 వేల మందికిపైగా భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. కార్తీక మాసంలో దీక్ష ప్రారంభించి 41 రోజుల పాటు కొనసాగిస్తారు. మకర సంక్రాంతి వరకూ ఈ దీక్షలు కొనసాగుతాయి. అయితే భక్తుల రద్దీ పెరిగి వారు వెళ్లే సమయంలో రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సులు, కార్లలో వెళుతున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండడం, వాహనాల రద్దీ, డ్రైవర్ల నిద్రలేమి తదితర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పొగమంచుతో మరీ ప్రమాదం
సమయం కలిసివస్తుందని భావించి చాలామంది కార్లలో శబరిమలై వెళుతున్నారు. అటునుంచి అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి రావొచ్చని భావిస్తున్నారు. అయితే జిల్లా నుంచి శబరిమలై దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవైపు ప్రయాణానికి 30 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎక్కువ మంది 7 సీట్ల కారును ఆశ్రయిస్తున్నారు. అన్ని గంటల పాటు ప్రయాణం అంటే కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఒకవైపు కఠిన దీక్ష, నిద్రలేమి, ఆహారం సక్రమంగా ఉండకపోవడం, పొగమంచు తదితర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలోనే జిల్లా నుంచి 300 నుంచి 500 వరకూ బస్సులు.. మరో 1000 వరకూ ప్రైవేటు వాహనాలు వెళుతుంటాయని అంచనా.
చాలీచాలని రైళ్లు..
జిల్లా నుంచి రైళ్ల సౌకర్యం అంతంతమాత్రంగా ఉంది. విశాఖ నుంచి 20 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు రైల్వేశాఖ చెబుతోంది కానీ ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల నుంచి వెళుతున్న భక్తులతో ఈ ప్రత్యేక రైళ్లు చాలడం లేదు. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకూ.. డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకూ శబరిమలైలోని అయ్యప్ప ఆలయం తెరిచే ఉంటుంది. మకర జ్యోతి కోసం జిల్లా నుంచి వేలాది మంది భక్తులు వెళుతుంటారు. కానీ విశాఖ నుంచి మాత్రమే శబరిమలై ప్రత్యేక రైల్ సర్వీసులు నడుపుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఏర్పాటుచేసినా జిల్లా భక్తులకు అవకాశం లేదు. సాధారణంగా గురుస్వామి నేతృత్వంలో పదుల సంఖ్యలో భక్తులు ఒకేసారి శబరిమలై వెళుతుంటారు. రైలులో నేరుగా వెళ్లే సౌకర్యం లేకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ స్పందించి నేరుగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు నడపాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.
ప్రత్యేక రైళ్లు నడపాలి
శబరిమలై యాత్రలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రైల్వేశాఖ స్పందించి జిల్లా నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలి. విజయనగరం నుంచి నేరుగా నడిపితే జిల్లావాసులకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవచూపాలి.
- నర్సింహులు, అయ్యప్ప భక్తుడు, రాజాం
రవాణా మెరుగుపడాలి
జిల్లా నుంచి దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ శబరిమలై చేరుకోలేం. ఎంతో నిష్టతో శబరిమలై వెళ్లే క్రమంలో రవాణా సదుపాయం మెరుగ్గా ఉండాలి. ఈ విషయంలో రైల్వేశాఖ స్పందించి అదనపు సర్వీసులను నడిపితే భక్తులకు చాలా ఉపయోగం.
- సంతోష్‌కుమార్, అయ్యప్ప భక్తుడు, రాజాం