Share News

accident శాశ్వత నిద్రలోకి...

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:46 PM

accident అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా తమిళనాడు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఆగి ఉన్న వీరి కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

accident శాశ్వత నిద్రలోకి...

శాశ్వత నిద్రలోకి...

నిశీధి సమయాన ఘోర ప్రమాదం

తమిళనాడులో రామేశ్వరం సమీపాన..

శబరిమల నుంచి తిరిగి వస్తుండగా..

రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా..

వెనుక నుంచి మరో కారు ఢీకొట్టిన వైనం

నలుగురు జిల్లావాసుల దుర్మరణం

మరో అయ్యప్ప భక్తుడికి గాయాలు

అయ్యప్పస్వామిని దర్శనం చేసుకున్నారు. ఇంటికి తిరుగు పయనమయ్యారు. సోమవారం వస్తామని కుటుంబీకులకు చెప్పారు. మార్గమధ్యంలో రెండు క్షేత్రాలకు బయలుదేరారు. నిర్విరామ ప్రయాణంతో పూర్తిగా అలసిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటి ఒంటిగంట అయింది. నిద్ర విపరీతంగా ముంచుకొస్తోంది. రోడ్డుకు ఓ పక్కగా కారు ఆపారు. అందరూ గాఢనిద్రలో మునిగిపోయారు. తెల్లవారుజాము 2 గంటలు అయింది. మరో కారు మృత్యువులా దూసుకొచ్చింది. వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. అంతే.. ఘోరం జరిగిపోయింది. నలుగురు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఒకరు గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు.

విజయనగరం/దత్తిరాజేరు/గజపతినగరం,

డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి)

అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా తమిళనాడు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఆగి ఉన్న వీరి కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతిచెందిన వారిలో దత్తిరాజేరు మండ లం కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన మార్పిన అప్పల నాయుడు(33), వంగర రామకృష్ణ(51), మరడ రాము (50), గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరావు(35) ఉన్నారు. రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన బెవర శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అయ్యప్పమాలను ధరించిన దత్తిరాజేరు మండలం కోర పుకొత్తవలస గ్రామానికి చెందిన మార్పిన అప్పలనాయుడు, వంగర రామకృష్ణ, మరడ రాము, గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరావు, రామభద్ర పురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన బెవర శ్రీరాములు 41 రోజుల అనంతరం అయ్యప్ప దర్శనం కోసం ఈనెల 1వ తేదీన శబరిమల బయలుదేరారు. స్వామి దర్శనం అనంతరం కన్యాకుమారి వెళ్లి ఆపై రామేశ్వరానికి ప్రయాణమయ్యారు. శుక్రవారం రాత్రి 1.30 నిమిషాల సమయంలో రామేశ్వరానికి 40 కిలోమీటర్ల దూరంలో రామనాథపురం గ్రామం సమీపానికి వచ్చేసరికి నిద్ర ముంచుకువస్తోందని డ్రైవింగ్‌ చేస్తున్న బండారు రామ చంద్రరావు చెప్పాడు. దీంతో రోడ్డు పక్కన కాసేపు ఆపుదా మని స్వాములంతా సూచించాక కారు ఆపి నిద్రపోతు న్నారు. ఇది జరిగి అరగంట తర్వాత అదే రోడ్డులో వేగంగా వస్తున్న మరో కారు వీరి కారును ఢీకొంది. నిద్రలో ఉన్న వారిలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

బెవర శ్రీరాములు ప్రాణాలతో బయట పడ్డారు. ఘటన జరిగిన తరువాత తెల్లవారు జామున స్థానికులు వచ్చి కారు అద్దాలు పగులగొట్టి మృతదేహలను బయటకు తీసినట్లు క్షతగ్రాత్రుడు బెవర శ్రీరాములు తెలిపారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందో నిద్రమత్తులో ఉన్న తమకు తెలియలేదని, గుండెనొప్పి అధికంగా ఉందని రామత్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానన్నారు.

రెండు గ్రామాల్లో విషాదం..

మరో రెండు రోజుల్లో ఇళ్లకు చేరుకుంటారని అనుకుంటున్న వారి కుటుంబీకులకు శనివారం తెల్లవారుజామున ఈ విషాద వార్త తెలిసింది. ఒక్కసారిగా వారంతా తల్లిడిల్లిపోయారు. ఘోరం జరిగిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. రామేశ్వరం తర్వాత తిరుపతి వెళ్లి సోమవారం సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నామని శుక్రవారం రాత్రి ఫోన్‌లో చెప్పారని, అంతలోనే ఇంత ఘోరం ఎలా జరిగిందంటూ రోదిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరారు. దత్తిరాజేరు మండలంలోని కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు స్వాములు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గజపతినగరం మండలం మరుపల్లిలో బండారు చంద్రరావు మృతి చెందినట్లు తెలిసి స్థానికులు చలించిపోయారు.

టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటూ జీవనం..

గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన బండారు రామచంద్రరావు దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి జంక్షన్‌ వద్ద టిఫిన్‌ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్లకిందట దుబాయ్‌వెళ్లి తిరిగి వచ్చిన చంద్రరావుకు దత్తిరాజేరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సత్యవతితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె శ్రీహిత, తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీనేష్‌ ఉన్నారు. శబరిమల యాత్రకు వెళ్లి చాలా రోజులు కావడంతో నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతున్న పిల్లలకు ఏం సమాధానం చెప్పాలని పిల్లలను పట్టుకొని సత్యవతి రోదించడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరుపెట్టారు. రామచంద్రరావు మృతిచెందినట్లు తెలిసి విషాదంలో మునిగారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా స్థానికులు చెప్పుకుంటున్నారు.

కిరాణా దుకాణం నడుపుతూ..

దత్తిరాజేరు మండలం కోరపుకొత్తవలస గ్రామానికి చెందిన మార్పిన అప్పలనాయుడుకు మేనమామ గెంజి త్రినాథ కుమార్తె గాయత్రితో మూడేళ్ల కిందట వివాహమైంది. షికారుగంజి రోడ్డు జంక్షన్‌ వద్ద కిరాణాషాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. త్రినాథ కుమారుడు సుమారు 5 సంవత్సరాల క్రితం విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో మేనళ్లుడుకు ఒక్కగానొక్క కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. కొడుకైనా, అల్లుడైనా అప్పలనాయుడే అనుకుని ఉన్నాడు. తమకు దిక్కెవరని మామయ్య, భార్య, కుటుంబీకులు బోరున విలపించారు. తల్లిదండ్రులు తిరుపతి, రాములమ్మలు వృద్ధాప్యంలో తమను చూసేదెవరని కన్నీరుమున్నీరయ్యారు.

కార్పెంటర్‌గా పనిచేస్తూ..

కోరపుకొత్తవలస గ్రామానికే చెందిన వంగర రామకృష్ణకు భార్య లక్ష్మి, కుమార్తెలు భవానీ, లత, తల్లి సూరమ్మ ఉన్నారు. అయ్యప్పస్వామిపై అపారమైన భక్తితో 20సార్లు మాల ధరించాడు. ఈసారి కూడా క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని అనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్తవిని భార్య, తల్లి కుప్పకూలిపోయారు. కార్పెంటర్‌ వృత్తిపని చేస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి లేకపోవడంతో వారంతా అనాథలయ్యారు. తామెలా బతకాలని భార్య, తల్లి, కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపించారు.

వ్యవసాయం చేస్తూ..

కోరపుకొత్తవలస గ్రామానికే చెందిన మరడ రాముకు భార్య పైడితల్లమ్మ, కుమారుడు ప్రసాద్‌, తల్లి సింహాచలమ్మ ఉన్నారు. రాము వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కుమారుడుని బెంగుళూరు పంపించి కోచింగ్‌లో చేర్పించాడు. కుమారుడు ఎదుగుదల చూడకముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడని భార్య కన్నీటి పర్యాంతమైంది.

ఆందోళన చెందిన శ్రీరాములు కుటుంబం..

రామభద్రపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండకెంగువ గ్రామానికి చెందిన బెవర శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. తండ్రి గున్నయ్య, తల్లి అప్పలనర్సమ్మ కుమారుని పరిస్థితిపై టెన్షన్‌ పడుతున్నారు. రామేశ్వరం దగ్గర రామనాథపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందింది. ఈయన గజపతినగరం మండలం శ్రీరంగరాజపురం వద్ద స్వయం ఉపాధి పొందుతూ అక్కడే ఉంటున్నాడు.

దిగ్ర్భాంతి చెందిన మంత్రి..

గజపతినగరం, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): శబరిమల వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జిల్లా వాసులు మృతిచెందినట్లు తెలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దిగ్ర్భాంతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలిశాక మనసు ను కలిచివేసిందన్నారు. ప్రాణాలతో బయటపడిన బెవర శ్రీరాములుకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసు కోవాలని అక్కడి జిల్లా కలెక్టరతో ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాలను వీలైనంత త్వరగా స్వగ్రామాలకు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

---------------------

Updated Date - Dec 06 , 2025 | 11:46 PM