abnormal petrol and desel జంకు ‘బంకు’ లేకుండా..
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:21 AM
abnormal petrol and desel శృంగవరపుకోట పట్టణ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్‌లో దసరాకు నాలుగైదు రోజుల ముందు స్థానికుడు కారులో డీజిల్ కొట్టించాడు. కారు స్టార్ట్ చేసిన వెంటనే ఇండికేషన్‌లో రివ్యూవాటర్ అని చూపించింది.
జంకు ‘బంకు’ లేకుండా..
పెట్రోల్, డీజిల్‌లో నీటిని కలిపి విక్రయాలు
పాడవుతున్న వాహనాలు
ప్రశ్నిస్తే బుకాయింపునకు దిగుతున్న బంకు నిర్వాహకులు
మొక్కుబడిగా అధికారుల తనిఖీలు
శృంగవరపుకోట పట్టణ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్‌లో దసరాకు నాలుగైదు రోజుల ముందు స్థానికుడు కారులో డీజిల్ కొట్టించాడు. కారు స్టార్ట్ చేసిన వెంటనే ఇండికేషన్‌లో రివ్యూవాటర్ అని చూపించింది. కొంతదూరం వెళ్లిన తరువాత కారు ఆగిపోయింది. ఎంతకి స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్‌కు చూపించాడు. ఫిల్టర్ క్లీన్ చేశాక డిజిల్‌లో నీరు కలిసిందని మెకానిక్ చెప్పడంతో ఆ పెట్రోల్ బంక్‌లో కొట్టించిన డీజల్‌ను ఓ సీసాలోకి తీసి చూశాడు. మరో సీసాలో వేరొక బంక్ నుంచి డీజల్‌ను కొట్టించాడు. ఈ డీజల్‌కు కారులో నుంచి పట్టిన డీజల్‌కు మధ్య తేడాను గుర్తించాక డీజిల్‌లో నీరు కలిసినట్లు స్పష్టంగా కనిపించడంతో కారులో డీజిల్ కొట్టించిన బంక్ వద్దకు వెళ్లి నిలదీశాడు. బంక్ యజమాని సమాధానం చెప్పకుండా తిరిగి బుకాయింపునకు దిగాడు. పైగా గొడవ పెడుతున్నాడని ఆయనే పోలీస్‌లకు సమాచారం అందించాడు. పోలీసులు బాధితుడికి సర్దిచెప్పి పంపించారు. జరిగిన అన్యాయాన్ని తలచుకుని వాపోవడం బాధితుని వంతు అయింది.
శృంగవరపుకోట, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కల్తీ జరుగుతోంది. నీటిని కలిపేసి విక్రయిస్తున్నారు. బాధితులు బంక్‌ల వద్దకు వెళ్లి ప్రశ్నించినప్పుడే పెట్రోల్, డీజిల్ కల్తీ బయటపడుతోంది. ఆ సమయంలోనూ బంకుల యజమానులదే పైచేయి అవుతోంది. తమకు అనుకూలంగా పోలీస్‌లు సహకరించేలా చేసుకుంటున్నారు. శాంతిభద్రల పరిరక్షణ పేరుతో పోలీస్‌లు బాధితుల గొంతు నొక్కేస్తున్నారు. దీంతో బంక్ యజమానులు యథావిధిగా తమ దందాను కొనసాగిస్తున్నారు. పెట్రోల్, డీజీల్ బంకుల అక్రమాలపై చర్యలు తీసుకొనే అదికారం స్థానికంగా ఉన్న అధికారులెవరికీ లేదు. దీంతో వీటిల్లో జరుగుతున్న అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా బాధితులకు తెలియకపోవడం కూడా యాజమాన్యాలకు కలిసి వస్తోంది. పెట్రోల్, డీజిల్ కల్తీ జరగకుండా చూసే బాధ్యత ఆయా కంపెనీల సేల్స్ అధికారులదే. స్థానిక అధికారులకు వాటి పర్యవేక్షణ బాధ్యతను మాత్రమే అప్పగించారు. అది కూడా తహసీల్దార్ స్థాయి అధికారి తనిఖీలు చేపట్టేవరకే పరిమితం. లోపాలను గుర్తిస్తే జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ఆయా కంపెనీలకు నివేదిస్తారు. అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు పెట్రోల్, డీజిల్ బంక్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కల్తీచేయడమే కాకుండా ఇవ్వాల్సిన పరిమాణంలో ఆయిల్ ఇవ్వడం లేదు.
ఫ తూనికలు, కొలతల విభాగం అధికారులు పెట్రోల్, డీజిల్ బంక్‌ల వైపు కన్నెత్తి చూడడం లేదు. బంక్ ఏర్పాటు సమయంలో పౌరసరఫరాల శాఖ నుంచి బి-ఫామ్ ధ్రువపత్రం పొందాల్సి వుంటుంది. దీన్ని స్థానికంగా వున్న రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పెట్రోల్ డీజిల్‌కు చెందిన ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రతిపాదనలు పంపించాలి. వీటి ఆధారంగా పౌరసరఫరాల శాఖ ఈ బి-ఫామ్ ధ్రువపత్రాన్ని అందిస్తుంది. ఇది పొందిన తరువాత కూడా గతంలో మూడు, నాలుగేళ్లకు ఓసారి తిరిగి పొందాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు. ఒకసారి పొందిన ధ్రువపత్రం లైఫ్‌టైం పనికొస్తుంది. ఇప్పుడు పూర్తిగా బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే కంపెనీల సేల్స్ అధికారులు తనిఖీలను చేస్తున్నారు. వీరికిచ్చిన షెడ్యూల్ ప్రకారం తనిఖీలకు వస్తుండడంతో ఆ సమయానికి బంక్‌ల యజమానులు జాగ్రత్త పడుతున్నారు.
ఫ కొంత మంది బంక్‌ల యజమానులు పెట్రోల్, డీజిల్ నిల్వల వాడకం సక్రమంగా లేదు. నిల్వలు పూర్తయ్యేవరకు పెట్రోల్, డీజిల్‌ను తెప్పించడం లేదు. దీనివల్ల ట్యాంకుల్లో నీరు చేరుతోందని, చూసుకోకుండా దాంట్లోనే పెట్రోల్, డీజిల్‌ను నింపేస్తుండడంతో కల్తీ జరుగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు.
వాహనదారుడే బాధితుడు
బంక్‌ల యజమానులు కావాలని పెట్రోల్, డీజిల్‌ను కల్తీ చేసినా.. నిర్లక్ష్యంతో కల్తీ జరిగినా వాహనదారుడే నష్టపోతున్నాడు. వాహనాలకు ఇచ్చే లైప్ కాలానికి ముందే చెడిపోతున్నాయి. వీరు చేసే కల్తీ వ్యాపారంతో చీటికి, మాటికి వాహనాలను మెకానిక్ షెడ్‌కు పంపించాల్సి వస్తోంది. వాహనదారుడు ఆర్థికంగా నష్టపోతున్నాడు. నిత్యం తనఖీలు జరిగితేనే ఈ పరిస్థితికి చెక్ పడుతుంది.