Share News

‘Aadali’... ‘ఆడలి’.. తగ్గిన తాకిడి

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:45 PM

‘Aadali’... Pressure Eased ఉమ్మడి జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్‌గా పేరొందింది సీతంపేట ఏజెన్సీ. చుట్టూ ఎత్తయిన కొండలు, జలపాతాలు, ప్రకృతి రమనీయ దృశ్యాలెన్నో సందర్శకులను కనువిందు చేస్తుంటాయి. అయితే సీతంపేటలో ప్రధానమైన ఆడలి వ్యూపాయింట్‌కు కొద్ది నెలలుగా పర్యాటకుల తాకిడి తగ్గింది. వరుస ప్రమాదాలు.. అధిక ధరలు తదితర కారణాలతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

‘Aadali’...   ‘ఆడలి’.. తగ్గిన తాకిడి
పర్యాటకులు లేక వెలవెలబోతున్న ఆడలి వ్యూపాయింట్‌

  • వరుస ప్రమాదాలతో ముఖం చాటేస్తున్న వైనం

  • ఇప్పటికే నలుగురి మృత్యువాత.. క్షతగాత్రులుగా మరికొందరు..

  • ఆలస్యంగా రక్షణ చర్యలు

  • పర్యాటక అభివృద్ధిపై ప్రభావం

సీతంపేట రూరల్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్‌గా పేరొందింది సీతంపేట ఏజెన్సీ. చుట్టూ ఎత్తయిన కొండలు, జలపాతాలు, ప్రకృతి రమనీయ దృశ్యాలెన్నో సందర్శకులను కనువిందు చేస్తుంటాయి. అయితే సీతంపేటలో ప్రధానమైన ఆడలి వ్యూపాయింట్‌కు కొద్ది నెలలుగా పర్యాటకుల తాకిడి తగ్గింది. వరుస ప్రమాదాలు.. అధిక ధరలు తదితర కారణాలతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ సహకారంతో సీతంపేట ఐటీడీఏ ప్రత్యేక నిధులు కేటాయించి గిరిశిఖర ప్రాంతంలో ఉన్న ఆడలి వ్యూపాయింట్‌ను అభివృద్ధి చేశారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులకు అంకితం చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం సందర్శకులతో కళకళలాడింది. అయితే ఆడలి వ్యూపాయింట్‌ మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఇటీవల ప్రమాదాలు సంభవించాయి. నెలల వ్యవధిలోనే పాలకొండ, సీతంపేటకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయాలపాలయ్యారు. దీంతో పర్యాటకుల్లో భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యూపాయింట్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

ధరలు ఇలా..

ఆడలి వ్యూపాయింట్‌ నిర్వహణకు సంబంధించి గత ఏడాది ఐటీడీఏ అధికారులు ఐదేళ్ల లీజు ప్రాతిపదికన ఆన్‌లైన్‌ టెండరింగ్‌ నిర్వహించారు. ఏడాదికి రూ.6లక్షల చెప్పున చెల్లించేందుకు ఎం.విజయచంద్‌ అనే టెండర్‌దారుడు ముందుకొచ్చారు. అయితే సంబంధిత లీజుదారుడు ఆడలి వ్యూ పాయింట్‌కు వచ్చే పర్యాటకుల నుంచి అధికమొత్తంలో వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యూపాయింట్‌ ప్రవేశ మార్గంలో చెక్‌పాయింట్‌ వద్ద ఎంట్రి టికెట్‌ రూ.30 చొప్పున ఒక్కొక్కరి వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఫొటోషూట్‌కు రూ.200, వెడ్డింగ్‌ షూట్‌(వీడియో షూట్‌)కు రూ.1000గా ధర నిర్ణయించారు. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. వ్యూ పాయింట్‌ చూసేందుకు వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పెద్ద మొత్తంలో వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఐటీడీఏ అధికారులు దృష్టిసారించాలని సందర్శకులు కోరుతున్నారు.

ఆలస్యంగా రక్షణ చర్యలు

ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో ఐటీడీఏ అధికారులు ఆలస్యంగా రక్షణ చర్యలు చేపట్టారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా బిడిందిగూడ, వెలంగూడ, బుడ్డడుగూడతో పాటు నాలుగో మలుపు వద్ద రూ.1.20కోట్లతో రక్షణ గోడలను నిర్మిస్తున్నారు. ఒక్కో రక్షణ గోడ నిర్మాణానికి రూ.30లక్షలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రెండు మలుపుల వద్ద పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఏపీవో ఏమన్నారంటే..

ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడు తున్నామని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు తెలిపారు. ఆ మార్గంలో నాలుగు చోట్ల రక్షణ గోడల నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు. వ్యూ పాయింట్‌ ప్రవేశ మార్గంలో లీజుదారులు నిర్ణయించిన ధరలను మరోసారి పరిశీలించి వారితో చర్చిస్తామని చెప్పారు.

Updated Date - Jul 21 , 2025 | 11:45 PM