When Will Construction Begin? నిధులు మంజూరై ఏడాది.. నిర్మాణమెప్పుడో మరి!
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:03 AM
A Year Since Funds Were Sanctioned... But When Will Construction Begin? పాలకొండలో నీటిపారుదలశాఖ సబ్ డివిజన్ భవన నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా.. ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు బ్రిటిష్ కాలం నాటి శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
కొద్దిరోజుల కిందట గోతులు తవ్వి వదిలేసిన వైనం
ముందుకు రాని కాంట్రాక్టర్
శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు
పాలకొండ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): పాలకొండలో నీటిపారుదలశాఖ సబ్ డివిజన్ భవన నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా.. ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు బ్రిటిష్ కాలం నాటి శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. భారీ వర్షాలు కురిస్తే.. ఏక్షణాన భవనం కూలిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో సంబంధిత ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాస్తవంగా తోటపల్లి కాలువల ఆఽధునికీకరణలో భాగంగా శ్రీకాకుళం ఈఈ కార్యాలయంతో పాటు పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి రూ.మూడు కోట్లు కేటాయించారు. ఇప్పటికే శ్రీకాకుళంలోని ఈఈ కార్యాలయ భవనాన్ని 1.70 కోట్లతో పూర్తి చేశారు. సుమారు రూ.కోటి అందుబాటులో ఉన్నప్పటికీ పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయం భవన నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెల రోజుల కిందటే గోతులు తవ్వి...
వెలగవాడ సమీపంలో భవన నిర్మాణం కోసం నెల రోజుల కిందటే గోతులు తవ్వారు. అయితే ఇప్పటికీ పిల్లర్స్ పనులు ప్రారంభం కాలేదు. భవన నిర్మాణం ఏ ప్రాంతంలో నిర్మించాలన్న దానిపై అధికారుల మధ్య స్పష్టత లేకపోవడం, కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పనులు మరింత ఆలస్యం కానున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.
ఇదీ పరిస్థితి..
- ప్రస్తుతం ఉన్న నీటిపారుదలశాఖ కార్యాలయం 50 సెంట్లలో ఉంది. పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఈ కార్యాలయ ప్రాంగణంలోనే భవన నిర్మాణం చేపట్టాలని 2018లోనే ప్రతిపాదన పంపారు. కార్యాలయ ప్రాంగణం కొంతమేర ఆక్రమణకు గురవగా, వాటిని తొలగించి నూతన భవనంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అధికారులు భావించారు. అయితే పట్టణం గుండా కార్యాలయానికి నిర్మాణ సామగ్రి తరలించడం కష్టసాధ్యమని.. వెలగవాడ సమీపంలో ఉన్న పూర్వపు లస్కర్స్ క్వార్టర్స్ స్థలంలో భవనం నిర్మించాలనుకున్నారు. ఈ మేరకు ఏడాది కిందటే ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు.
- వెలగవాడ సమీపంలో భవనం నిర్మించనున్న స్థలంపై రైతు సంఘం నాయకులు అభ్యంతరం తెలిపారు. ప్రజాధనం వృఽథా కాకుండా ఈ భవన నిర్మాణంపై ముందుగానే సమాలో చనలు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నీటిపారుదలశాఖ అధికారులు తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా విశాల ప్రదేశంలో భవన నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నోటీసు ఇచ్చాం
ఏడాది గడుస్తున్నా వెలగవాడ సమీపంలో భవన నిర్మాణ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చాం. ఆయన నుంచి వచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
-గనిరాజు, డీఈఈ