A warming movement వేడెక్కుతున్న ఉద్యమం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:48 PM
A warming movement కూటమి ప్రభుత్వ ఆలోచన ప్రకారం జిందాల్‌కు అప్పగించిన భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ పార్కులు) పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనలో జిల్లా యంత్రంగం ఉంది.
వేడెక్కుతున్న ఉద్యమం
ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసిన జిందాల్ నిర్వాసితులు
ఇక్కడా వివిధ రూపాల్లో కొనసాగుతున్న నిరసనలు
తేలిగ్గా తీసుకుంటున్న ఉన్నతాధికారులు
ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణాలపైనా అనుమానాలు
సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రస్తావిస్తారని రైతుల్లో ఆశ
కూటమి ప్రభుత్వ ఆలోచన ప్రకారం జిందాల్‌కు అప్పగించిన భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ పార్కులు) పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనలో జిల్లా యంత్రంగం ఉంది. జిందాల్ యాజమాన్యం మాట తప్పడంతో భూములను తిరిగి ఇవ్వాలన్న పట్టుదలతో భూ నిర్వాసితులు ఉన్నారు. ఈ సమస్య మూడు నెలలుగా నలుగుతోంది. రెవెన్యూ ఉన్నతాధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఉద్యమం రోజురోజుకు ముదురుతోంది. నిర్వాసితులు ఇటీవల ఢిల్లీలో సైతం ధర్నా చేసి సమస్యను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబుతో సోమవారం నుంచి జరిగే కాన్ఫరెన్స్‌లో సమస్యను కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ప్రస్తావిస్తారని నిర్వాసితులు భావిస్తున్నారు.
శృంగవరపుకోట, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
ఓ పక్క న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు స్థానికంగా వివిధ రూపాల్లో నిరసనలతో సమస్యను జిందాల్ నిర్వాసితులు అందరికీ తెలియజేస్తున్నారు. నాలుగు రోజుల కిందట దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం ద్వారా సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టిలోనూ పెట్టారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆ సంఘం దీనిపై జిల్లా అధికారులను వివరణ అడిగినట్లు సమాచారం. ఇలా భూ నిర్వాసితులు రోడ్డెక్కి 85 రోజులు దాటుతోంది. అయితే శాంతిభద్రతల పేరుతో పోలీస్‌లు ఽధర్నా, నిరవధిక నిరసన శిబిరాలను ఏర్పాటు చేసుకొనేందుకు స్థానికంగా అనుమతులు ఇవ్వలేదు. వీరొకచోట కావాలని అడిగితే పోలీస్‌లు మరోచోట ఇస్తామని చెబుతూ పలు షరతులు విధిస్తున్నారు. ఈ పరిణామం భూ నిర్వాసితులకు రుచించడం లేదు. వీరి డిమాండ్‌కు అనుగుణంగా రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదు. కేవలం అప్పట్లో భూములకు నష్టపరిహారం అందని వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మిగిలిన సమస్యల పరిష్కారం గురించి పెదవి విప్పడం లేదు. దీంతో జిందాల్ యాజమాన్యం మాటకే రెవెన్యూ యంత్రాంగం విలువ ఇస్తోందన్న అపవాదు ఉంది. జిందాల్ యాజమాన్య ఒత్తిడికి అధికార యంత్రాంగం తలొంచుతోందని భూ నిర్వాసితులు భావిస్తున్నారు. సమస్యను ఎటూ తేల్చకపోవడంతో ఆ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఎస్‌ఈ పార్కులు) పరిశ్రమల నిర్మాణాలపైనా నిరుద్యోగులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి సమస్యను ప్రస్తావిస్తారని భూ నిర్వాసితులతో పాటు నిరుద్యోగ యువత ఆశిస్తోంది.
2007 జూన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అల్యూమినియం శుద్ధి కర్మాగారం (రిఫైనరీ విద్యుత్ పవర్ ప్లాంట్) నిర్మాణం చేపట్టేందుకు జెఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (జిందాల్ యాజమాన్యం)కు శృంగవరపుకోట మండల పరిధిలో 1166.43ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, జిరాయితీ భూములను అప్పగించింది. ఈ భూముల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 834.66 ఎకరాల డి.పట్టా భూములున్నాయి. అప్పట్లో వీరంతా భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఈ భూముల్లో మామిడి, జీడి, కొబ్బరి, అరటి, చెరకు, వంటి వాణిజ్య పంటలతో పాటు వరి, రాగులు వంటి ఆహార ధాన్యాలు సాగు చేసేవారు. అయితే భూములిస్తే రైతులకు నష్టపరిహారంతో పాటు పిల్లలకు ఉద్యోగాలు, షేర్లు, నివాస గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్థానిక రాజకీయ నాయకులతో చెప్పించారు. వీరి మాటలను నమ్మి భూములను అప్పగించారు. నాలుగేళ్లలో నిర్మిస్తామని చెప్పిన పరిశ్రమకు ఇంతవరకు పునాదులు పడలేదు. ఇంకేం పరిశ్రమ నిర్మిస్తారన్న భావనతో కొంతమంది ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే భూములను తీసుకున్న 18 సంవత్సరాల తరువాత అల్యూమినియం శుద్ధి కర్మాగారానికి బదులుగా పది రకాల ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కులు నిర్మిస్తామని జిందాల్ యాజమాన్యం ముందుకు వచ్చింది. భూములను చదును చేస్తుండడంతో నిర్వాసితులు అడ్డుకోనే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి వివాదం నడుస్తోంది. నిర్వాసితులు పట్టువదలకుండా ఉద్యమం నడుపుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జిందాల్ యాజమాన్యం పరిశ్రమ నిర్మాణం చేయకపోవడంతో పాటు ఉద్యోగాలు, షేర్లు, ఇతర సదుపాయాలు కల్పించలేదు కాబట్టి తిరిగి భూములను ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెలలుగా పోరాటం చేస్తున్నా జిల్లా అధికారులు నిర్వాసితులు, జిందాల్ యాజమాన్యంతో చర్చలు ఏర్పాటు చేయడం లేదు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామసుందర్ రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం చూపడం ద్వారా పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేస్తారేమోనని నిరుద్యోగ యువత భావిస్తోంది. తమకూ ఓ మార్గం చూపుతారని నిర్వాసితులు ఆశతో ఉన్నారు.