ఇంటికో కథ.. తీరేనా వ్యథ!
ABN , Publish Date - May 01 , 2025 | 12:00 AM
A Story for Every Home... Will the Sorrow Ever End? ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన జీగిరాం జూట్ మిల్లు మూతపడడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కుటుంబాల పోషణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వివిధ పనుల కోసం నిత్యం పరుగులు పెడుతున్నారు.
మిల్లు తెరవకపోవడంతో కూలి పనులకు పరుగు
అరకొర ఆదాయం.. బతుకు భారం
సాలూరు రూరల్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన జీగిరాం జూట్ మిల్లు మూతపడడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కుటుంబాల పోషణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వివిధ పనుల కోసం నిత్యం పరుగులు పెడుతున్నారు. వాస్తవంగా మిల్లు ప్రారంభించిన తరువాత వివిధ గ్రామాల నుంచి పొట్టచేత పట్టుకొని ఎంతోమంది కార్మికులుగా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. కార్మిక కుటుంబాలతో జీగిరాం జూట్ కాలనీ ఏర్పడింది. జీగిరాం వాసులతో పాటు సాలూరు, కూర్మరాజుపేట, జన్నివలస, పాచిపెంట, అమ్మవలస, కందిరివలస తదితర గ్రామాలకు చెందిన 1800 మంది ప్రత్యక్షంగా, మూడు వేల మంది పరోక్షంగా జూట్ మిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తుండేవారు. కాగా మిల్లుకు శ్రీరాఘవ ఆగ్రో ఇండస్త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2022, జూన్ 9న లాకౌట్ నోటీసు ప్రకటించింది. ఆ రోజు ఉదయం ఆరు గంటల షిప్టుకు క్యారియర్స్‌తో విధులకు వచ్చిన కార్మికులు నోటీసు చూసి షాక్‌కు గురయ్యారు. కార్మిక కుటుంబాలు ఆకస్మికంగా రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం ఆయా కుటుంబాలు వివిధ పనుల్లోకి వెళ్లుతున్నాయి. కొందరు భవన నిర్మాణ, వ్యవసాయ, కళాసీ పనులకు వెళ్తున్నారు. మరికొందరు హోటల్స్ తదితర వాటిల్లో పనులు చేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. మరికొం దరు కుటుంబాలను వదలి కోటబొమ్మాళి, రాజాం ప్రాంతాల్లో జూట్ మిల్లుల్లో పనిచేస్తున్నారు. కొంతమది పాన్‌షాపు, టిఫిన్ దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మిల్లు తెరిపించాలని కార్మికులు రోజుల తరబడి నిరవధిక దీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపైనే జూట్ కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. కొద్దిరోజుల కిందట వారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిశారు. మిల్లు తెరిపించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆమె కార్మికులకు హామీ ఇచ్చారు.
ఎక్కడ పని ఉంటే అక్కడికి..
కుటుంబాన్ని పోషించడానికి కళాసీ పనులకు వెళ్తున్నా. ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్తున్నా. మిల్లు తెరిస్తే బాగుంటుంది.
- ఎస్.శంకరరావు, జూట్ కార్మికుడు, కూర్మరాజుపేట
====================================
పాన్‌షాపుతో జీవనం
జీగిరాం జూట్ మిల్లు మూసివేసిన తరువాత ఏమి చేయాలో తెలియలేదు. బతుకు భారంగా మారింది. పలువురు సూచన మేరకు పాన్‌షాపు పెట్టుకున్నాను. మిల్లు తెరిపిస్తే అందరికి మంచిరోజులు వస్తాయి.
- కంది రామునాయుడు, జూట్ కార్మికుడు, జీగిరాం
====================================
మంత్రిపై నమ్మకం ఉంది..
జీగిరాం జూట్ మిల్లు తెరిపించడానికి మంత్రి సంధ్యారాణి కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేనేజ్‌మెంట్‌తో మాట్లాడారు. మేనేజ్‌మెంట్‌లో ఒకరు అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరుగుతుంది. ఆమె కార్మికుల ఉపాధి కోసం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తారనే నమ్మకం ఉంది.
- బేత సింహాచలం, జూట్ కార్మిక ప్రతినిధి,జీగిరాం