Share News

A Sea of Tears..! కన్నీటి సంద్రం..!

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:10 AM

A Sea of Tears..! ఆశలు గల్లంతయ్యాయి.. చివరకు కన్నీళ్లే మిగిలాయి. జంఝావతి రబ్బరు డ్యామ్‌లో ఆదివారం స్నానానికని దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. సోమవారం విగతజీవులుగా కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు.

A Sea of Tears..! కన్నీటి సంద్రం..!
మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి సంధ్యారాణి

  • కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు

  • సివినిలో విషాద ఛాయలు

కొమరాడ, నవంబరు24(ఆంధ్రజ్యోతి): ఆశలు గల్లంతయ్యాయి.. చివరకు కన్నీళ్లే మిగిలాయి. జంఝావతి రబ్బరు డ్యామ్‌లో ఆదివారం స్నానానికని దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. సోమవారం విగతజీవులుగా కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. వారి జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు స్వగ్రామం సివినిలో కూడా విషాద ఛాయలు అలు ముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నాగావళిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది.. సోమవారం వేకువజామున గుంప సోమేశ్వరాలయం సమీపంలోని నదితీరంలో అధికారి గోవింద నాయుడు, అరసాడ ప్రదీప్‌ మృతదేహాలను గుర్తించారు. సాయంత్రం కోటిపాం సమీపంలోని కారిరేవు వద్ద రాయగడ శరత్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. గోవింద, ప్రదీప్‌ అంత్యక్రియలు పూర్తయినట్లు ఎస్‌ఐ కె.నీలకంఠం తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

బాధిత కుటుంబాలకు మంత్రి పరామర్శ

బెలగాం: పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రబ్బరు డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:10 AM