A 'pure' lie! ‘శుద్ధ’ అబద్ధం!
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:56 PM
A 'pure' lie! అన్నిరకాల రుగ్మతలకు తాగునీరే ప్రధాన కారణమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాగేనీరు మంచిదైతే వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. ఈ కారణంతోనే జిల్లాలో చాలా మంది శుద్ధ జలాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు.
‘శుద్ధ’ అబద్ధం!
జిల్లాలో పుట్టగొడుగుల్లా ఆర్వో ప్లాంట్లు
అనుమతులు లేనివే అధికం
నిబంధనలు పట్టని వైనం
ప్రజారోగ్యంపై పెనుప్రభావం
అన్నిరకాల రుగ్మతలకు తాగునీరే ప్రధాన కారణమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తాగేనీరు మంచిదైతే వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. ఈ కారణంతోనే జిల్లాలో చాలా మంది శుద్ధ జలాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ఆర్వో ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే శుద్ధి చేసిన నీటిని అందిస్తే మంచిదే కానీ నిర్వాహకులు కేవలం లాభాపేక్షతో దోపిడీకి దిగుతున్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలు, నిబంధనలు పాటించడం లేదు. ఈ విషయం తెలియక నీళ్లు తీసుకెళ్తున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
విజయనగరం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పట్టణం, పల్లె తేడా లేకుండా వందలాదిగా ఆర్వో ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 80 భారీ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో అనుమతులు ఉన్నవి కేవలం 17 మాత్రమే. మిగతావి అనధికారికంగా నడుపుతున్నట్టు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు 31 ప్లాంట్లను స్వయంగా తనిఖీ చేయగా కేవలం నాలుగింటికే అనుమతులు ఉన్నట్టు తేల్చడం ఆందోళన కలిగించింది. కొన్నిచోట్ల ఇతర శాఖల నుంచి అనుమతులు తీసుకున్నా.. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందలేదు. కొందరు ట్రస్టుల పేరుతో ప్లాంట్లను నడుపుతున్నారు. ఇటువంటి వారు ఇళ్లకు క్యాన్లతో నీటిని సరఫరా చేయకూడదు. ప్లాంటు వద్దకు వస్తే నామమాత్రపు ధరకు అందించాల్సి ఉంటుంది కానీ ఇళ్ల వద్దకు వెళ్లి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
12 రకాల శుద్ధి జరుగుతోందా?
స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవంటారు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా అనుమానించి వాడకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భూగర్భ జలాన్ని శుద్ధి చేసే సమయంలో ఫిల్ర్టేషన్, ఏరేషన్, కార్భన్ ఫిల్ర్డేషన్ ఇలా 12 రకాల శుద్ధి ప్రక్రియలు నిర్వహించాలి. జిల్లాలో ఇవెక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. శుద్ధ జలకేంద్రం నిర్వహణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. కనీస స్థాయిలో కూడా నిబంధనలు అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. ఐఎస్‌వో ప్రమాణాలు ప్రకారం సీసాలు, క్యాన్లను పాలీ ఇథలిన్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ ప్రొఫిన్లతో తయారైనవి మాత్రమే వాడాలి. కానీ జిల్లాలో ప్లాస్టిక్‌తో తయారుచేసిన సీసాలు, క్యాన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని 48 గంటల తరువాత మాత్రమే క్యాన్లు, సీసాల్లో వేయాలి. ఈ ప్రక్రియ వెంటనే చేపట్టడం వల్ల దాని గాఢత పడిపోతుంది. ఈ నీరు తాగడం వల్లే గొంతు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
అధిక ధరలకు విక్రయాలు..
ఆర్వో ప్లాంట్ల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎటువంటి శుద్ధి చేయకుండానే నీటిని సీసాలు, క్యాన్లతో నింపుతున్నారు. వాటినే రూ.30ల వరకూ విక్రయిస్తున్నారు. నీటి వ్యాపారం ఒక మాఫియాగా మారిపోయింది. విజయనగరంలాంటి చోట అపార్ట్‌మెంట్లు ఎక్కువ. వాటికి శుద్ధ జలాలు అందించాలంటే ధర అధికం. ఎందుకంటే అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కి అందించాల్సి ఉంటుంది. దీంతో 20 లీటర్ల క్యాన్‌ను రూ.50 వరకూ విక్రయిస్తున్నారు. నాణ్యత పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టు అవుతోంది. శుద్ధ జలాల్లో నీటి సాంద్రత విలువలు అధికం. అయితే కనీస స్థాయిలో కూడా శుద్ధి చేయకపోవడంతో నీటి సాంధ్రత విలువలు పడిపోతున్నాయి. మినరల్స్‌లో వ్యత్యాసం కూడా ఉంటోంది. సమతుల్యం పాటించకపోవడంతో నీరు మరింత పాడవుతోంది. ఆ నీరు తాగడం వల్ల నరాలు, ఎముకలు, జ్ఞాపకశక్తి, దంత, కిడ్నీ, చర్మసంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. తల వెంట్రుకలు సైతం రాలిపోతున్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గముఖం పడుతోంది. అందుకే ఆర్వో ప్లాంట్ల నీటిని వినియోగిస్తున్న వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాడుకోవడం ఉత్తమం. నిబంధనలు పాటించని ఆర్వో ప్లాంట్లపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది.
దృష్టిపెడతాం
జిల్లాలో ఆర్వోప్లాంట్లపై ప్రత్యేకంగా దృష్టిపెడతాం. నిబంధనలు పాటించని వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నిత్యం తనిఖీ చేసేలా అధికారులకు ఆదేశాలిస్తాం. ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే ప్రజలే నేరుగా ఫిర్యాదుచేయాలి. అన్నిశాఖల అనుమతులు పొందని వారిపై చర్యలు ఉంటాయి.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
-----------