Share News

ఉపాధికి ‘ప్రణాళిక’!

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:28 AM

ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గ్రామాల్లో గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది.

 ఉపాధికి ‘ప్రణాళిక’!

కొత్త పనులు గుర్తించేందుకే

బడ్జెట్‌ అంచనాలపైనా నివేదిక

గ్రామాల్లో చురుగ్గా గ్రామసభలు

ఈసారి నాలుగు కేటగిరీల్లో 192 రకాల పనులకు అవకాశం

రాజాం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి గ్రామాల్లో గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. భారీ వర్షాల తర్వాత సాగునీటి వనరుల్లో నీరు నిల్వ ఉండడంతో ఈ పనులకు అవకాశం లేదు. అందుకే ఇతర ప్రజోపయోగ పనులను గుర్తిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు కేటగిరీల కింద 192 రకాల పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయి. నవంబరు 18న పంచాయతీలు ఉపాధి పనుల బడ్జెట్‌కు ఆమోదం తెలపాలి. అదే నెల 30న మండల పరిషత్‌, డిసెంబరు 15న జిల్లా పరిషత్‌ ఈ బడ్జెట్‌ను ఆమోదిస్తాయి. డిసెంబరు 31లోగా ఈ ప్రక్రియ పూర్తికావాలి. ఉపాధి ప్రణాళికను ‘యుక్తధార’ పోర్టల్‌లో నమోదుచేస్తారు. ఒక వేతనదారుడికి రోజుకు రూ.307 వేతనం, రూ.204.66 మెటీరియల్‌ కాంపోనెంట్‌ కలిపి రూ.511.66 ఇచ్చే విధంగా అంచనా బడ్జెట్‌ను రూపొందిస్తారు.

జిల్లాలో 777 పంచాయతీలుండగా 3,85,508 జాబ్‌కార్డులు ఉన్నాయి. 6,87,403 మంది వేతనదారులు పనిచేస్తున్నారు. అయితే యాక్టివ్‌లో ఉన్న జాబ్‌కార్డులు 3,46,260కాగా.. క్రియాశీలకంగా పనులకు హాజరవుతున్న వేతనదారులు 5,71,511 మంది ఉన్నారు. ఈసారి వీలైనన్ని ఎక్కువ పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గ్రామసభల్లో ప్రజలకు అవసరమైన సామాజిక పనులు గుర్తిస్తున్నారు.

పనులు ఇవే..

మొక్కలు నాటడం, ఫీడర్‌ ఛానెల్స్‌ బాగుచేయడం, ఫీల్డ్‌ బండ్‌లు, భూమి అభివృద్ధి, కమ్యూనిటీ వాటర్‌ హార్‌ వేస్టింగ్‌ పాండ్లు, రీచార్జి షిట్లు, పర్కులేషన్‌ ట్యాంకుల నిర్మాణం, వర్షపునీటి సంరక్షణ పనులు, ట్రెంచ్‌లు, చెక్‌డ్యాములు, సాగునీటి బావుల నిర్మాణం, పంటకాలువలు, చెరువుల్లో పూడికతీత, కందకాల తవ్వకాలు, పండ్ల తోటల పెంపకం, తుపాను షెల్టర్లు, ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక పూర్తికాగానే ఉపాధి కొత్త పనులు ప్రారంభం కానున్నాయి.

పంచాయతీల్లో కమిటీలు..

గ్రామ పంచాయతీ స్థాయిలో పనులు గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేశారు. బడ్జెట్‌ రూపకల్పనలో ఈ కమిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కమిటీలో సాంకేతిక సహాయకుడు/బీఎఫ్‌టీ, సచివాలయ సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, క్షేత్ర సహాయకుడు, పంచాయతీలో సీనియర్‌ మేట్‌, లైన్‌ డిపార్ట్‌మెంట్ల నుంచి సభ్యులుంటారు. ఈ బృందాన్ని ఏపీవో పర్యవేక్షిస్తారు. గ్రామసభల షెడ్యూల్‌ పీవో/ఎంపీడీవో నిర్ణయిస్తారు. వేతనదారులు, పంచాయతీ పరిధిలోని గ్రామలను అనుసరించి ఈ బడ్జెట్‌ ప్రణాళికను మూడు నాలుగు రోజుల్లో తయారుచేయాల్సి ఉంటుంది. ఈ సారి గోకులాలు, మ్యూజిక్‌ డ్రైన్లకు ప్రాధాన్యం ఇస్తారు.

ప్రజోపయోగ పనులకు పెద్దపీట

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనదారులుకు పూర్తిస్థాయిలో పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రజోపయోగ పనులకే పెద్దపీట వేస్తాం. నాలుగు కేటగిరిల కింద 192 రకాల పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది.

- శారదాదేవి, డ్వామా పీడీ, విజయనగరం

Updated Date - Oct 17 , 2025 | 12:28 AM