తెలుగుదేశం పార్టీకి కొత్త కార్యాలయం
ABN , Publish Date - May 17 , 2025 | 11:32 PM
A new office for Telugu Desam Party తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యాలయ భవన నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మెడికల్ కళాశాల సమీపంలో స్థలాన్ని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించింది.
తెలుగుదేశం పార్టీకి కొత్త కార్యాలయం
స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం
నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామన్న మంత్రి శ్రీనివాస్
రూ.5 లక్షల విరాళం ప్రకటించిన అశోక్ గజపతిరాజు
విజయనగరం రూరల్, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యాలయ భవన నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మెడికల్ కళాశాల సమీపంలో స్థలాన్ని 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ప్రభుత్వం కేటాయించింది. దీనికి జిల్లా అధికార యంత్రాంగం తొలుత అనుమతిచ్చింది. క్యాబినెట్ కూడా ఆమోదించింది. తాజాగా శనివారం టీడీపీ నాయకులు ఆ స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయ నిర్మాణం ఏ విధంగా చేపట్టాలన్న దానిపై చర్చించారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కలెక్టరు అంబేడ్కర్ స్థలాన్ని పరిశీలించారు. విజయనగరం తహసీల్దారు కూర్మనాథ్‌రావు, సర్వేయర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, కార్యాలయ నిర్మాణానికి తన వంతు సాయం కింద రూ.5 లక్షలు ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశానుసారం విజయనగరం జిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిబంధనల ప్రకారం స్థలం లీజు రూపంలో తీసుకున్నామన్నారు. కార్యాలయ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఏడాదిలోగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, అధునాతన సౌకర్యాలతో టీడీపీ కార్యాలయ నిర్మాణం జరగనుందన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, పార్టీకి శాశ్వత కార్యాలయం నిర్మాణం జరిగితే టీడీపీ శ్రేణులకు కార్యాలయ సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, 2026లో కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యాలయ నిర్మాణానికి టీడీపీ నేతల సహాయ సహకారాలు ఎంతో అవసరమన్నారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, బొద్దల నర్సింగరరావు, పి.రాజేష్ వర్మ, కర్రోతు నర్సింగరావు, కర్రోతు రాధామణి, గంటా రవి తదితరులు పాల్గొన్నారు.