Roads గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:21 AM
A New Dawn for Rural Roads జిల్లాలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. నాలుగు నియోజకవర్గాల్లోని 23 రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.42.37 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే 80.249 కిలోమీటర్ల పొడవున రహదారులను నిర్మించనున్నారు.
త్వరలోనే పనులకు శ్రీకారం
పార్వతీపురం, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. నాలుగు నియోజకవర్గాల్లోని 23 రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.42.37 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే 80.249 కిలోమీటర్ల పొడవున రహదారులను నిర్మిం చనున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరిం చింది. గ్రామీణ ప్రాంత రోడ్లకు ఒక్క రూపాయి కేటాయించలేదు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు అనుసంధానంగా ఉన్న పల్లె రోడ్లన్నింటినీ నిర్లక్ష్యం చేసింది. దీంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో ద్విచక్ర వాహన దారులు అదుపుతప్పి కింద పడేవారు. ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ఆసుపత్రి పాలయ్యారు. అత్యధిక గ్రామాలకు అనుసంధానంగా వున్న ప్రధాన రహదారులను కూడా బాగు చేసేందుకు ఆలోచన చేయలేదు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోడ్లను బాగు చేయాలని నిర్ణయించింది. బాగా పాడైన రోడ్లను తొలుత మార్చాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటోంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కి) కింద నాబార్డ్ ఈ నిధులను కేటాయించింది. రోడ్లును బాగు చేయనుండడంతో ఆయా గ్రామాల ప్రజల నుంచి అనందం వ్యక్తమవుతోంది.