Mini Reservoir మినీ రిజర్వాయర్ నిర్మిస్తే సస్యశ్యామలమే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:24 AM
A Mini Reservoir Can Turn It Lush and Green జిల్లాలో మూడు మండలాల పరిధిలో ఉన్న రాళ్లగెడ్డ మినీ రిజర్వాయర్ నిర్మాణం కలగా మారింది. సుమారు పది వేల ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యం ఉన్నా.. దానిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీని నిర్మాణం కోసం తూర్పు ఏజెన్సీ ప్రాంత రైతులు కొన్నేళ్లుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
పూడికలతో నిండిన కాలువలు
పది వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం
ప్రతిపాదనలు పంపినా స్పందించని గత వైసీపీ సర్కారు
రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు
జియ్యమ్యవలస, జూన్ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు మండలాల పరిధిలో ఉన్న రాళ్లగెడ్డ మినీ రిజర్వాయర్ నిర్మాణం కలగా మారింది. సుమారు పది వేల ఎకరాలకు సాగునీరందించే సామర్థ్యం ఉన్నా.. దానిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీని నిర్మాణం కోసం తూర్పు ఏజెన్సీ ప్రాంత రైతులు కొన్నేళ్లుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. వైసీపీ సర్కారు కనీసం కాలువల నిర్వహణకు కూడా నిఽధులు మంజూరు చేయలేదు. సుమారు రూ.2కోట్లతో అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు పంపినా వైసీపీ స్పందించలేదు. దీంతో గిరిజన రైతులంతా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ పరిస్థితి..
రాళ్లగెడ్డ అనేది.. జియ్యమ్మవలస, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో పది వేల ఎకరాలకు సాగునీరందించే రెండు ప్రధాన కాలువల సమూహం. ఇందులో నార్త్ ప్రధాన కాలువ పొడవు 5.5 కిలో మీటర్లు. దీని ద్వారా అర్నాడ, జియ్యమ్మవలస, డంగభద్ర, గడసింగుపురం పంచాయతీల్లో 11 గ్రామాల పరిధిలో 9,500 ఎకాలకు సాగునీరందుతుంది. సౌత్ ప్రధాన కాలువ పొడవు 6 కిలో మీటర్లు. దీని ద్వారా వీరఘట్టం మండలం సంతనర్సిపురం పంచాయతీలో 500 ఎకరాలకు సాగునీరందుతుంది. సీతంపేట మండలంలో మానాపురం, తాడిపాయి గ్రామాల్లో మరో 200 ఎకరాలకు కూడా దాని ద్వారా సాగునీరందే వీలుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సీతంపేట మండలం మానాపురం - తాడిపాయి గ్రామాల మధ్య ఉన్న రెండు కొండల మధ్య మినీ రిజర్వాయర్ నిర్మిస్తే మూడు మండలాల్లో 10 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి.
పూడికలతో నిండిన కాలువలు
సీతంపేట కొండలపై నుంచి వచ్చే నీరు ఈ రాళ్లగెడ్డ ద్వారా భూములకు నీరందుతంది. అయితే నిర్వహణ లేక కాలువలు ఇసుక, మట్టితో పేరుకుపోగా శివారు భూములకు నీరందడం లేదు. దశాబ్దాల కిందట నిర్మించిన డ్రాపులు, స్ట్రక్చర్లు, చెక్‌డ్యాములు, మదుములు, కల్వర్టులన్నీ శిఽథిలమైపోయాయి. కనీసం 5 వేల ఎకరాలకైనా సాగునీరందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు గ్రామాలను వదిలి వలస బాటపట్టారు. బోర్లు తీసుకునే ఆర్థిక స్థోమత లేక బతుకు జీవుడా అంటూ మరికొంతమంది రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజం లేకపోయింది. దీనిపై స్పందించేవారే కరువయ్యారు. రాళ్లగెడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం విషయంలో పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం శ్రద్ధ చూపాలి
రాళ్లగెడ్డపై మినీ వంతెన నిర్మాణం అనేది మా చిరకాల ఆకాంక్ష. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. దాని నిర్మాణం పూర్తయితే మా భూములు సస్యశ్యామలం అవుతాయి.
- జోగి భుజంగరావు, సర్పంచ్, డంగభద్ర
=========================
తీవ్రంగా ఉద్యమిస్తాం
రాళ్లగెడ్డపై మినీ వంతెన నిర్మిస్తే సీతంపేట, వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల్లో 13 పంచాయతీల్లో వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. దీనిపై ఎక్కువగా గిరిజన రైతులే ఆధారపడి ఉన్నారు. నిర్మాణం చేపట్టకపోతే తీవ్రంగా ఉద్యమిస్తాం.
- కె.సీతారాం, రైతు సంఘం కార్యదర్శి
==============================
ప్రభుత్వం దృష్టిలో ఉంది
రాళ్లగెడ్డపై మినీ వంతెన నిర్మాణం అనేది గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది.
- జీవీ రఘు, ఏఈ, నీటి పారుదలశాఖ