Share News

తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:56 PM

పోలిపల్లి సమీపంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వైపు సర్వీస్‌ రహదారిలో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది.

తప్పిన పెను ప్రమాదం
బస్సునుంచి దిగిపోయిన ప్రయాణికులు.

-బయటకు వచ్చిన ఆర్టీసీ బస్సు చక్రం

- అప్రమత్తమైన వాహనాన్ని ఆపేసిన డ్రైవర్‌

-90 మంది ప్రయాణికులు సురక్షితం

భోగాపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలిపల్లి సమీపంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వైపు సర్వీస్‌ రహదారిలో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ అప్రమత్తతతో 90 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీకాకుళం డిపో-1కు చెందిన ఏపీ 30వై 4323 నెంబరు గల ఆర్టీసీ పాసింజర్‌ బస్సు 90 మంది ప్రయాణికులతో శనివారం విశాఖపట్నం వెళ్తుంది. పోలిపల్లి సమీపంలోకి వచ్చే సరికి బస్సు వెనుక చక్రం బయటకి వస్తూ పైభాగాన్ని తాకుతుండడంతో ఆ వేడికి రబ్బరు కాలుతూ పొగలు రావడంతో ఊపిరాడక ప్రయాణికులు ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. అప్పటికే బస్సు అదుపు తప్పినట్లు డ్రైవర్‌ జి.తిరుపతి గమనించడంతో క్షణాల్లో తేరుకొని నిలుపుదల చేశాడు. దీంతో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురైన ప్రయాణికులు చిన్నారులు, వృద్ధులతో కలిసి ఒక్కసారిగా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో కొంత మంది ప్రయాణికులు కిందపడ్డారు. అందరూ బస్సు దిగి దూరంగా పరుగులు తీశారు. డ్రైవర్‌ దిగి బస్సును పరిశీలించగా వెనుక ఎడమ వైపు చక్రాలకు సంబంధించి బ్రేకు షూ లూజుకావడం, బేరింగులు కొట్టేయడంతో లోపలకు ఉండాల్సిన చక్రం కొంత మేర బయటకి వచ్చినట్లు గుర్తించాడు. చక్రం బస్సు భాగాన్ని తాకడంతో పొగలు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే చక్రం ఊడిపోయి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగేదోనని, ఆ భగవంతుడే తమను కాపాడారని ప్రయాణికులు అంటున్నారు. అనంతరం ఆటోలు, ఇతర బస్సుల్లో అక్కడనుంచి వారు బయలుదేరారు. దీనిపై కండక్టర్‌ మూర్తి మాట్లాడుతూ.. బస్సు కెపాసిటీ 50 మంది ప్రయాణికులు అని, కానీ 90 మంది ఎక్కారని తెలిపారు.

Updated Date - Dec 13 , 2025 | 11:56 PM